గద్వాల: భారత్‌మాల ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టిన గద్వాల – గట్టు మార్గంలో అండర్‌పాస్ నిర్మించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఎంపీ కలిసి.. జిల్లాలోని గట్టు, రాయపురం గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సోలాపూర్ – కర్నూలు – చైన్నె గ్రీన్ ఫీల్డ్ హైవేలో గట్టు–గద్వాల రహదారి వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ డీకే అరుణ ‘సాక్షి’కి తెలిపారు.
చేనేత సమస్యలపై
ప్రత్యేక దృష్టి
అలంపూర్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమలశాఖ సహాయ సంచాలకురాలు ఇందిర బుధవారం కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలి సి శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా లోని చేనేత రంగ పరిస్థితులు, కార్మికుల సంక్షేమ పథకాలపై చర్చించారు. చేనేత సహకార సంఘాల పర్యవేక్షణపై ఎమ్మెల్యే ఆరా తీశారు. కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ లు, ప్రోత్సాహకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నిరంతర కృషితో
లక్ష్యసాధన: డీఐఈఓ
ధరూరు: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని డీఐఈఓ హృదయరాజు సూచించారు. బుధవారం ధరూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రేరణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతర కృషితో నిర్దేశిత లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. కష్టపడి చదివే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
పల్లీ క్వింటా రూ.8,369
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 198 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,369, కనిష్టంగా రూ. 3,369, సరాసరి రూ. 5,066 ధరలు లభించాయి. 22 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 3,150 ధర పలికింది.


