అఖిలపక్షం.. ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

అఖిలపక్షం.. ఉద్యమం

Aug 5 2026 12:48 AM | Updated on Aug 5 2026 12:48 AM

అలంపూర్‌: దేశంలోనే పేరుగాంచిన శక్తి పీఠం.. శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాంతంగా ప్రాచుర్యం.. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి అసెంబ్లీ స్థానం.. మహిమాన్విత అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. కానీ, అలంపూర్‌వాసుల్లో మాత్రం నిత్యం ఏదో ఒక అలజడి నెలకొంటుంది. అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించిన మరుక్షణమే ఆటంకాలు వచ్చిపడుతున్నాయి. డివిజన్‌గా ఎదగాల్సిన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా తరలివెళ్లడం ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తరలి వెళ్తుందనే ఆందోళన స్థానికులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే దీనిని అడ్డుకునేందుకు అఖిలపక్ష నాయకులు ఉద్యమానికి పూనుకుంటున్నారు.

130 ఏళ్ల చరిత్ర..

అలంపూర్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 1888 నవంబర్‌ 2న నిజాం కాలంలో రాయచూరు జిల్లాగా ఉన్న సమయంలో అలంపూర్‌లో సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా నియోజకవర్గంలోని అప్పటి 5, ఇప్పటి 8 మండలాల గ్రామాల భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు కొనసాగేవి. సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో గతంలో అలంపూర్‌, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోళి, ఎర్రవల్లి మండలాల్లోని 97 గ్రామాలు, అయిజ మండలంలోని 3 గ్రామాలు కలిపి మొత్తం 100 గ్రామాలకు చెందిన భూ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. జిల్లాల ఆవిర్భావం తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో అలంపూర్‌, ఉండవెల్లి మండలాలకే పరిమితం చేశారు. మిగిలిన మండలాలను గద్వాల సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయానికి అనుసంధానం చేయడం జరిగింది.

స్థలం లేదనే సాకుతో..

అలంపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ కొనసాగుతోంది. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఈ ప్రాంతంలో స్థలం కొరతను సాకుగా చూపుతూ మరో ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ వంద పడకల ఆస్పత్రిని అలంపూర్‌లోనే నిర్మించాలని పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. రెండు దశాబ్దాల క్రితమే సీఐ కార్యాలయం తరలివెళ్లగా.. ఈ ప్రాంతానికి వచ్చిన గురుకుల పాఠశాలలు సైతం అదే తరహాలో తరలించారు. ప్రస్తుతం అదే తంతు జరుగుతుండటంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఏకతాటిపైకి నాయకులు..

నియోజకవర్గ కేంద్ర అభివృద్ధిపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు, యువత, రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తరలించవద్దని వినతులు అందించారు. అలాగే మంత్రులు, ఎంపీకి సైతం కార్యాలయం తరలించకుండా చర్యలు తీసుకోవాలని లేఖలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కావాల్సిన స్థలం ఎంపికలోనూ నిమగ్నమయ్యారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ

తరలింపును నిరసిస్తూ పోరుబాట

కలెక్టర్‌, ప్రజాప్రతినిధులను

కలిసి విజ్ఞాపనలు

ఏకతాటిపైకి వచ్చి అభివృద్ధిపై భవిష్యత్‌ కార్యాచరణ

స్థానికంగానే కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement