ధరూరు: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో రైతులు అందుకు తగ్గట్టుగా పంటలను సాగు చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం వద్ద గంగమ్మకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి.. కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వరి వంటి పంటలను సాగుచేసుకుని నష్టపోవద్దని రైతులకు సూచించారు. రైతుల కష్టాలు, బాధలను అర్థం చేసుకుని ఈ సారి 30వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తక్కువ నీటితో పండించే వేరుశనగ, శనగ, సజ్జ, జొన్న, మినుములు, ఆముదం, పెసర, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని తెలిపారు. జూరాలకు ఎగువ నుంచి వరద తక్కువగా వస్తుందని.. వరద వచ్చినన్ని రోజులు కాల్వలకు నీటి విడుదల ఆపొద్దని ఆయన అధికారులకు సూచించారు. తద్వారా రిజర్వాయర్లు, చెరు వులు నిండి, భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. పశువులకు కూడా గ్రాసం ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు. సాగునీటి కాల్వలకు నీటి విడుదలకు సహకరించిన రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, గడ్డం కృష్ణారెడ్డి, శ్రీధర్‌గౌడ్, బండ్ల రాజశేఖర్‌రెడ్డి, డీఆర్ విజయ్‌కుమార్, కురుమన్న, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.


