రాజోళి: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. తుమ్మిళ్ల ప్రాజెక్టులో మల్లమ్మకుంట రిజర్వాయర్ అత్యంత కీలకం కాగా.. భూ సేకరణపై నెల రోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాసిత రైతులతో అధికారులు చర్చించినప్పటికీ ససేమిరా అనడం.. సర్వే చేసేందుకు వచ్చే అధికారులను అడ్డుకోవడంతో పనులు ముందుకు సాగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బుధవారం వడ్డేపల్లి మండల తహసీల్దార్ శివకుమార్ ఆధ్వర్యంలో తనగల గ్రామ శివారులో ఎస్‌డీసీ (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) కార్యాలయ సిబ్బంది, 15 మందికి పైగా సర్వేయర్లు భూ సర్వే చేపట్టగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ మెగిలయ్య, సీఐ శంకర్ సమక్షంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మొత్తానికి అధికారులు 4 కి.మీ. మేర హద్దులను ఏర్పాటుచేశారు. అధికారుల వెంట ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఉన్నారు.


