గద్వాల క్రైం: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పలు విభాగాలను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాంబ్ డిస్పోంజల్ విభాగం సిబ్బంది నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానిత వ్యక్తులను గుర్తించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటుచేసిన సీసీ నిఘాను నిత్యం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. విపత్కర ఘటనలకు పాల్పడే నిందితులను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు వారి కార్యకాలపాలను నిర్వీర్యం చేసేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు.


