గద్వాల న్యూటౌన్: నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు శుక్రవారం తలపెట్టిన విద్యాసంస్థల బంద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఇందులో భాగంగా ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వెళ్లి బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు వెంకటేష్, హలీంపాష, ప్రవీణ్, వామన్‌పల్లి రంగస్వామి మాట్లాడుతూ.. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా వారిపై లాఠీచార్జి చేయడం, కేసులు నమోదు చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. నీట్ పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రవీణ్, రాజుయాదవ్, హరీశ్, అనస్, గంగాధర్, యామప్ప, చంటి, అంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


