అయిజ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిబంధనల మేరకు పనిచేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు హెచ్చరించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతిచెందిన వ్యక్తులకు వస్తున్న పింఛన్ డబ్బును వారి కుటుంబ సభ్యులు ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారని, వాటిని గుర్తించి రెవెన్యూ రికవరీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మండలంలోని ఉత్తనూరులో పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. మృతిచెందిన వ్యక్తులకు సంబంధించి పింఛన్ డబ్బును వారి కుటుంబ సభ్యులు ఏటీఎంను ఉపయోగించి డబ్బు విత్‌డ్రా చేసుకుంటున్న మూడు కుటుంబాలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
ఉండవెల్లి: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్‌గౌడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీతోపాటు బీఎడ్ అర్హతతో పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్, అనుభవ ధ్రువపత్రాలు, జడ్చర్లలోని ఆర్‌సీఓ ఆఫీస్‌లో ఈ నెల 20లోగా దరఖాస్తులతోపాటు అందజేయాలని సూచించారు.
రోడ్డు కనెక్టివిటీ కల్పించాల్సిందే..
గట్టు: మండలంలో కొత్త నిర్మిస్తున్న భారత్‌మాల రోడ్డుతో మండలానికి కనెక్టివిటీ ఇచ్చే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి 151వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ గట్టుపై కోపం పెంచుకోకుండా రవాణా సౌకర్యాలు మెరుగుపడే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త రోడ్డుకు కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు కనెక్టివిటీతోపాటు రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
పల్లి @ రూ.8 వేలు
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 1,945 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.8,000, కనిష్టంగా రూ.4,409, సరాసరిగా రూ.5,920 ధరలు లభించాయి.


