గద్వాల న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిందని, ఇందులో లక్ష్యం మేరకు విద్యార్థులు చేరేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో విద్య, వైద్యం, తాగునీరు, ప్రజాపాలన, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ జిల్లాల వారీగా వర్షపాతం గురించి తెలియజేస్తూ.. వివిధ రకాల పంటల సాగు వివరాలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా కూడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి వీసీకి అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని పరిస్థితులు వివరించారు. వీసీ అనంతరం అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. వీసీలో పేర్కొన్న ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఐఈఓ హృదయరాజు, డీఈఓ విజయలక్ష్మి, సీపీఓ వెంకటనారాయణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి రాజ్‌కుమార్, డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


