●
విచారణ చేపడుతాం..
ప్రత్యర్థుల చేతిలో మృతిచెందిన గుంటిపల్లి రాజు కుటుంబంతో నగదు ఒప్పందంపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడుతాం. హత్య వెనుక మరెవరిదైనా ప్రమేయం ఉందా అనే విషయాలపై ఆరా తీస్తాం. ఎవరికై నా నగదు ఒప్పందంతో సంబంధం ఉన్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. సిబ్బంది నిర్లక్ష్యం వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవు. – మొగిలయ్య, డీఎస్పీ
గద్వాల క్రైం: గద్వాల మండలంలోని శెట్టిఆత్మకూర్ గ్రామానికి చెందిన గుంటిపల్లి రాజు హత్యలో కొత్త ట్విస్టు వెలుగుచూసింది. తొమ్మిదేళ్లనాటి పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. అయితే ఓ వ్యక్తి మాత్రం మృతిచెందిన గుంటిపల్లి రాజు కుటుంబ సభ్యులకు రూ.6 లక్షలు ఒప్పందం చేసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్సుగా రూ.లక్ష అందజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హత్య కేసులో కొత్తగా నగదు ఒప్పందం వెలుగులోకి రావడంపై సర్వత్రా చర్చకు దారితీసింది.
ఇదీ అసలు విషయం..
2014లో ఆంజనేయులు (మృతిచెందిన వ్యక్తి) భార్య సైదమ్మతో గుంటిపల్లి రాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజు ఆమెతో శెట్టిఆత్మకూర్ గ్రామం విడిచి వెళ్లిపోయి గద్వాలలో స్థిరపడ్డారు. 2017లో శెట్టిఆత్మకూర్‌లో రాజు బంధువుల ఇంటికి వ్యక్తిగత పనులపై వెళ్లాడు. ఈ క్రమంలో ఆంజనేయులు, బంధువులు గ్రహించి భార్యను తీసుకెళ్లిన సంఘటనపై ద్వేషంతో రాజు ఉన్న ఇంటి వద్దకు చేరుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో రాజు ఆంజనేయులును గొడ్డలితో తలపై దాడి చేసి, ఇటుక రాళ్లతో విచక్షణారహితంగా కొట్టాడు. రాజు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు కర్నూలులోని ఓ ఆస్పత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు 9 సంవత్సరాల తర్వాత గుంటిపల్లి రాజును హత్య చేసి పరారైనట్లు తెలిసింది.
ఆ వ్యక్తి ఎవరు..?
తాజాగా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన గుంటిపల్లి రాజు కుటుంబ సభ్యులకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.6 లక్షలు ఒప్పందం చేసుకోవడంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ హత్యకు ఏమైనా సహకారం అందించాడా.. లేక హత్యానేరం తనపై పడకుండా నగదు ఒప్పందం చేసుకున్నాడా అనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. హత్య సంఘటనపై విచారణ బృందం ఈ వ్యవహారంపై దృష్టి సారించలేక పోయారా.. లేక తెలిసే మనకేందుకు అని ఊరుకున్నారా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయా.. అసలు నగదు ఒప్పందం చేసుకున్న వ్యక్తి రాజకీయ నాయకుడా.. ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా ఏ వ్యక్తి అయినా ప్రమాదవశాత్తు మృతిచెందిన కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతారు.
ప్రత్యర్థులది తొమ్మిదేళ్ల నాటి పాత కక్షలు
బాధిత కుటుంబంతో రూ.6 లక్షలకు ఒప్పందం
తెరవెనక ఉన్న శక్తులెవరో..?
విచారణ జరుపుతున్న పోలీసులు


