రాజోళి/ మల్దకల్: రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి మండలం జూలకల్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పచ్చర్ల, మేడికొండ గ్రామాల్లో నెలకొల్పిన 33/ 11కేవీ సబ్‌స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. మల్దకల్ మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంతోపాటు, గట్టు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకు ముందు శాంతిగనర్‌లో ఏర్పాటు చేసన హెలీప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎంకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం డీడీలు చెల్లించిన రైతులందరికీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసి అందజేస్తున్నామన్నారు. అలాగే పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, 1.6 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం ఎంపీ మల్లు రవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి కేకు కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు సరిత, గట్టు తిమ్మప్ప, విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్లు మధన్‌మోహన్, నర్సింగరావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి, ఎస్‌ఈ నాగరాజు, ఏడీఈ గోవిందు, డీఎస్పీ మొగులయ్య, నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సత్యారెడ్డి, విక్రమసింహారెడ్డి, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
వర్చువల్ పద్ధతిలో విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు
హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి


