ఉపాధి హామీ కూలీలకు మేలు చేకూర్చండి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ కూలీలకు మేలు చేకూర్చండి

Published Wed, Mar 26 2025 1:33 AM | Last Updated on Wed, Mar 26 2025 1:29 AM

ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు మేలు చేకూర్చాలని అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు అన్నారు. మంగళవారం ఇటిక్యాల నుంచి పెద్దదిన్నె రోడ్డు వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, రైతుల పొలాలకు వెళ్లే నక్ష దారి గురించి కొందరు అభ్యంతరం తెలుపగా.. అదనపు కలెక్టర్‌ వారితో నేరుగా మాట్లాడి నచ్చజెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్‌ మొహియుద్దీన్‌, ఏపీఎం శివజ్యోతి, ఆర్‌ఐ భీంసేన్‌రావు, సర్వేయర్‌ దౌలమ్మ, పంచాయతీ కార్యదర్శి రమేష్‌, టీఏ పురేందర్‌ పాల్గొన్నారు.

కోర్టు భవనానికి

రూ. 81కోట్లు మంజూరు

గద్వాల: జిల్లా కేంద్రంలో కోర్టు భవన సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తూ జీఓ జారీ చేసినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోర్టు భవన సముదాయం నిర్మాణానికి రూ. 81కోట్లను మంజూరు చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

నేడు హుండీ లెక్కింపు

అలంపూర్‌: అలంపూర్‌ క్షేత్రంలో బుధవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ పురేందర్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలతో పాటు అన్నదాన సత్రంలోని హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.

వేరుశనగ క్వింటాల్‌ రూ.6,150

గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డుకు మంగళవారం 1242 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,150, కనిష్టంగా రూ. 3,011, సరాసరి రూ. 4,589 ధరలు వచ్చాయి. 18 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,513, కనిష్టంగా రూ. 3,819, సరాసరి రూ. 6,296 ధరలు లభించాయి. 46 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 3,361, సరాసరి రూ. 6,091 ధరలు వచ్చాయి.

హైవేలో అక్రమ

నిర్మాణాల కూల్చివేత

అలంపూర్‌: ఉండవెల్లి మండలం పుల్లూరు శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం అదికారులు తొలగించారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద నేషనల్‌ హైవే అథారిటీ కార్యాలయానికి సమీపంలోని 448 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోర్టు ద్వారా మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఎలాంటి స్పందన లేకపోవడంతో, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉండవెల్లి తహసీల్దార్‌ ప్రభాకర్‌, ఆర్‌ఐ శ్రీవాణి, సర్వేయర్‌ రాఘవేంద్ర, ఏఎస్‌ఐ సుబ్బారెడ్డి, రెవెన్యూ, పోలీసు, నేషనల్‌ హైవే ఆధికారులు మంగళవారం అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు.

నవోదయ

ఫలితాలు విడుదల

బిజినేపల్లి: వట్టెం జవహార్‌ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ భాస్కర్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

ఉపాధి హామీ కూలీలకు మేలు చేకూర్చండి 
1
1/1

ఉపాధి హామీ కూలీలకు మేలు చేకూర్చండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement