మల్హర్(కాటారం)/భూపాలపల్లి అర్బన్: బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతోపాటు ఆమె ఆత్మహత్యకు కారణమైన కేసులో వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం ప్రకారం.. 2021, డిసెంబర్ 9న కాటారం మండలానికి చెందిన ఓ బాలిక ఆధార్ కార్డు పని కోసం మండలకేంద్రానికి వెళ్తోంది. ఈ క్రమంలో అదే మండలం చింతకాని గ్రామానికి చెందిన గోల్కొండ రాజశేఖర్ ఆ బాలికను బెదిరించి తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే చంపుతానని బెదిరించాడు. అవమానంతో బాలిక గడ్డి మందు తాగి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై బాలిక బాబాయి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌హెచ్‌ఓ మహేందర్ కేసు నమోదు చేయగా, సీఐ రంజిత్‌రావు నిందితుడిని అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ పర్యవేక్షణలో కోర్టు లైజన్ ఆఫీసర్, ఏస్సైఐ వెంకన్న, కానిస్టేబుల్ రమేశ్ సాక్షులను ప్రవేశపెట్టగా పీపీలు విష్ణువర్ధన్‌రావు, వెంకట్రామ్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో రాజశేఖర్‌కు యావజ్జీవ శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
నేడు మెగా ఆయుర్వేద
వైద్యశిబిరం
భూపాలపల్లి అర్బన్: ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో బుధవారం మెగా ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ ఇన్‌చార్జి డాక్టర్ కె.రాఘవేందర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆయుష్ ఇంటిగ్రేటెడ్ 50 పడకల ఆస్పత్రిలో ఉదయం 9 గంటల నుంచి శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. మధుమేహం, రక్తపోటు, ఉదర, చర్మ, కిడ్నీ సమస్యలు, పైల్స్ తదితర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్య పరీక్షలు, చికిత్స, వైద్యుల సలహాలు అందిస్తామని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి రూరల్: అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల సాధికారత రాష్ట్ర పురస్కారాల కోసం వయోవృద్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీమతి మల్లేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన సీనియర్ సిటిజన్లు, వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు అర్హులని ఆమె పేర్కొన్నారు.
జిల్లాస్థాయికి ఎంపిక
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ మండల స్థాయి ఎంపిక పోటీల్లో సింగరేణి కాలరీస్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.నాంచారయ్య తెలిపారు. ఈ.సంధ్య (అండర్–17 ఖోఖో), ఎన్.కీర్తన (అండర్–14 ఖోఖో), బి.హారిణి (అండర్–17 కబడ్డీ), సీహెచ్.ధనుష్‌కుమార్ (అండర్–14 కబడ్డీ), సీహెచ్.రీష్వంత్ (అండర్–14 ఖోఖో) జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. విద్యార్థులను సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎ.రాజేశ్వర్‌రెడ్డి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, పీఈటీ ఎం.శైలజ, ఉపాధ్యాయులు అభినందించారు.
ముగిసిన యువ టూరిజం క్లబ్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇల్లంద్ క్లబ్‌హౌజ్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ‘యువ టూరిజం క్లబ్స్’ పోటీలు మంగళవారం ఘనంగా ముగిశాయి. జిల్లా టూరిజం నోడల్ అధికారి, అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రఘు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ‘డిజిటల్ అజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం’, ‘ప్రమోటింగ్ హెరిటేజ్ అండ్ కమ్యూనిటీ’ ఇతివృత్తాలతో పాఠశాలలు, కళాశాలలకు చెందిన యువ టూరిజం క్లబ్ విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


