బరిలో 11 యూనియన్లు | - | Sakshi
Sakshi News home page

బరిలో 11 యూనియన్లు

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

బరిలో 11 యూనియన్లు

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల బిజీలో యూనియన్‌లు తలమునకలయ్యాయి. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న 11 యూనియన్‌లు సోమవారం కార్మిక శాఖకు లేఖలు అందించాయి. దీంతో పోటీలో ఉండే యూనియన్‌లపై కార్మికులకు స్పష్టత వచ్చింది. మంగళవారం డిపోల వారీగా డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను డిపో మేనేజర్లు కార్మిక శాఖకు అందించారు. కార్మిక శాఖ తిరిగి యూనియన్‌లకు జాబితా ఇచ్చింది. డ్రాఫ్ట్‌ జాబితా ప్రకారం వరంగల్‌ రీజియన్‌లో మొత్తం 3,096 మంది ఓటర్లు ఉన్నారు. రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో 51 మంది ఓటర్లు ఉన్నారు. హనుమకొండ డిపోలో 537, భూపాలపల్లిలో 274, వరంగల్‌–1లో 484, మహబూబాబాద్‌ డిపోలో 250, తొర్రూరులో 303, నర్సంపేటలో 291, జనగామలో 403, పరకాలలో 244 మంది, వరంగల్‌–2 డిపోలో 259 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 24 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి 25న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. 26న యూనియన్‌లకు గుర్తులు కేటాయిస్తారు. తదనంతరం ప్రచారం ఉధృతం కానుంది.

లేఖలు ఇచ్చిన సంఘాలు..

గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు 11 యూనియన్‌లు కార్మిక శాఖకు సమ్మతి తెలిపాయి. వాటిలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌, టీఎస్‌ ఆర్టీసీ కార్మిక్‌ సంఘ్‌, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, ఆర్టీసీ కార్మిక పరిషత్‌, బహుజన కార్మిక యూనియన్‌, బహుజన వర్కర్స్‌ యూనియన్‌ ఉన్నాయి.

రాష్ట్ర, రీజియన్‌ వారీగా పొత్తు ఒప్పందాలు..

గెలుపు అవకాశాలను అంచనా వేసిన యూనియన్‌లు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు క్లాస్‌–3 (రాష్ట్ర), క్లాస్‌–6 (రీజియన్‌) వారీగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ) మధ్య పొ త్తుపై ఒప్పందం కుదిరినట్లు ఆ యూనియన్‌ నాయకులు తెలిపారు. వరంగల్‌, ఖమ్మం రీజియన్‌ (క్లాస్‌–6) ఎన్‌ఎంయూకు, రాష్ట్రంలోని మిగతా రీజి యన్‌లు, క్లాస్‌–3కి ఎంప్లాయీస్‌ యూనియన్‌కు మద్దతు ఇచ్చేలా అంగీకారం కుదిరింది..

● తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) మధ్య అవగాహన కుదిరినట్లు తెలిసింది. క్లాస్‌–6లో ఖమ్మం, నల్లగొండ రీజియన్‌లలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, మిగతా రీజియన్‌లు, క్లాస్‌–3లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ పోటీలో ఉండేల ఒప్పందం కుదిరినట్లు ఆ యూనియన్‌ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వరంగల్‌ రీజియన్‌లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ మద్దతు ఇస్తుంది.

● టీఎంయూ అశ్వత్థామ రెడ్డి వర్గం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌గా పోటీ చేయనుంది. వరంగల్‌ రీజియన్‌లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (టీఎంయూ అశ్వత్థామ రెడ్డి వర్గం), ఎంప్లాయీస్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌లు బలంగా ఉన్నాయి.

● మిగతా యూనియన్‌లు ఉన్నప్పటికి అంతగా ప్రభావం చూపకపోవచ్చని కార్మిక వర్గాలు తెలిపాయి.

● ఈ రీజియన్‌లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ మధ్య పోటీ ముఖాముఖిగా జరిగే అవకాశముంది. ఈ నెల 26న గుర్తుల కేటాయింపుతో పోటీపై మరింత స్పష్టత రానుంది.

పోటీకి ఆసక్తి చూపుతూ

కార్మిక శాఖకు లేఖల అందజేత

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల బిజీలో యూనియన్లు.. రీజియన్‌ పరిధిలో 3,096 మంది ఓటర్లు

ఈయూ, ఎన్‌ఎంయూ మధ్య

కుదిరిన పొత్తు

వరంగల్‌ రీజియన్‌ ఎన్‌ఎంయూకు

టీడబ్ల్యూయూతో జత కట్టిన

ఎస్‌డబ్ల్యూఎఫ్‌.. వరంగల్‌ రీజియన్‌ టీఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు,

ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఖమ్మం, నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement