ఏర్పాట్లు పూర్తి..
కాళేశ్వరం: కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి (నేడు) బుధవారం జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీసంఖ్యలో విగ్రహాలు కాళేశ్వరం తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ ఏడాది ఎల్‌నినో ఎఫెక్ట్‌తో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా లేదు. గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి ఇబ్బంది ఉండడంతో కాళేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
క్రేన్లు ఏర్పాటు..
భారీగా తరలివచ్చే విగ్రహాలను వాహనాల నుంచి సురక్షితంగా దించేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. వంతెనపైన రెండు ప్రాంతాల్లో నిమజ్జనం చేసేందుకు స్టాండ్స్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో విగ్రహాలు లోనికి క్రేన్‌లో వేసి నిమజ్జనం చేస్తారు. భక్తులు, గణేశ్ ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్లను కూడా పరిశీలించి తగిన చర్యలు చేపట్టారు.
జిల్లాలో 297 విగ్రహాలు..
జిల్లాలో 297 గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. గతేడాది కాళేశ్వరంలో 500లకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈసారి వెయ్యి వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. జిల్లాతో పాటు ములుగు, పరకాల, వరంగల్, జమ్మికుంట, మంథని తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు ప్రైవేట్ వాహనాల్లో కాళేశ్వరం చేరుకోనున్నాయి. దీంతో నిమజ్జన ప్రాంతంలో భారీగా రద్దీ నెలకొనే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పంచాయతీ, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, ఫిషరీస్ ఇతర శాఖల సిబ్బందిని పురమాయించారు.
నేడు కాళేశ్వరానికి
తరలిరానున్న గణపతి విగ్రహాలు
ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
ఎన్‌నినోతో చెరువులు, కుంటల్లో
నీరు లేక కాళేశ్వరంలో ఏర్పాట్లు
జిల్లాలో 297 విగ్రహాలు
కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గజ ఈతగాళ్లు, క్రేన్‌లు, స్టాండ్‌లు ఏర్పాట్లు చేశామన్నారు. డీఎల్‌పీఓ మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీడీఎ రవీంద్రనాథ్, కార్యదర్శి శ్రీధర్ ఏర్పాట్లు పరిశీలించారు.


