కాళేశ్వరం: గోదావరి పుష్కరాల పనులు, కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడొద్దని, పారదర్శకంగా చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, దార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి పరిశీలించారు. విజయగణపతి, ప్రధాన ఆలయం, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల పునాది పనులు చూశారు. అనంతరం ఈఓ కార్యాలయంలో వివిధ శాఖల ద్వారా చేపట్టనున్న పనులను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా పరిశీ లించి తగు సూచనలు ఇచ్చారు. ఈఓ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, అటవీ, దేవాదాయ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్టీసీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీపడొద్దన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి సేకరణతోపాటు ఇతర అనుమతుల ప్రక్రియను అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని కోరారు. పనుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ అధికారులు కాళేశ్వరంలోనే ఉంటూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పురోగతిని కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్‌శర్మ ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన సమన్వయం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి కాళేశ్వరం క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ దండు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, దేవాలయ శిల్పి స్థపతి బాలసుబ్రహ్మణ్యం, దేవస్థానం చైర్మన్ మోహన్‌శర్మ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల, సింగిల్‌విండో చైర్మన్ తిరుపతి, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తి, సీఐలు వెంకటేశ్వర్లు, నాగార్జునరావు ఎస్సై తమాషారెడ్డి, సర్పంచ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
అధికారులు స్థానికంగా ఉంటూ పనులను పర్యవేక్షించాలి
రాష్ట్ర ఐటీశాఖమంత్రి
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో అన్నిశాఖలతో సమీక్ష


