భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–3లో మంగళవారం ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ‘బాయి బాట’ కార్యక్రమం నిర్వహించారు. బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై కార్మికుల సమస్యలను తెలుసుకొని మాట్లాడారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జాతీయ భద్రతా మార్గదర్శకాల ప్రకారం ఉత్పత్తి చేపట్టాలని సూచించారు. మెడికల్ బోర్డు పరీక్షలను కొత్తగూడెంలో కాకుండా సంబంధిత ఏరియా ఆస్పత్రుల్లో నిర్వహించాలని, అన్‌ఫిట్ విధానాన్ని క్రమం తప్పకుండా అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. రిటైర్డ్ కార్మికులకు వైద్య సహాయ పరిమితిని రూ.8లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచాలని, కార్మికులకు కనీసం 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రికార్డుల్లోని మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలని, కొత్త లేబర్ కోడ్‌ల అమలుపై పునరాలోచించాలని కోరారు. భూపాలపల్లి ఏరియా ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు, సీటీ, అల్ట్రాసౌండ్ సేవలకు అవసరమైన సిబ్బందిని నియమించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్రం, స్థానిక నాయకులు రాజేందర్, జోగ బుచ్చయ్య, రత్నం సమ్మిరెడ్డి, వేణుగోపాల్ యాదవ్, చెల్పూరి సదయ్య, బొడ్డు అశోక్, షేక్ హుస్సేన్, శ్రీనివాస్, హరికృష్ణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


