● ఎడతెరిపి లేని జడివాన
● చెరువులకు జలకళ
● ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద
మత్తడిపోస్తున్న మల్హర్ మండలంలోని వల్లెకుంట చెరువు
కాళేశ్వరం: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో గడిచిన ఐదు రోజుల వరకు అసలు వర్షాలు లేక ఆకాశం వైపు దీనంగా చూసిన రైతులకు ఈ కుండపోత వర్షాలు ఊరటనిచ్చాయి. వానల కోసం చిన్నపిల్లలతో కప్పతల్లి ఆటలు ఆడిస్తూ, ఆలయాల్లో వరుణ యాగాలు చేస్తూ దేవుళ్లను వేడుకున్న రైతులు ఆనందంలో మునిగారు. వర్షాలు లేక ఎండిపోయి బోసిపోయిన చెరువులు, కుంటలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల్లోకి గోదా వరి, ప్రాణహిత నదుల గుండా వరద తరలిరావడంతో జలకళను సంతరించుకుంది. సరైన సమయానికి కురిసిన వానలతో పంటలకు ప్రాణ వాయువులా మారాయి. పొలాలకు కావాల్సినంత నీరు చేరడంతో ఎండిపోయే దశలో ఉన్న పత్తి మొక్కలు,వరి నారుమడుల పైర్లకు ఊపిరిపోసింది. దీంతో రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు.
పలుచోట్ల నిలిచిన రాకపోకలు..
మహదేవపూర్ మండలం చండ్రుపల్లి వద్ద రహదారిపైన నీరు తరలిరావడంతో రాకపోకలు నిలిచాయి. ఊరచెరువు, పడిదం చెరువు, కొచ్చెరువుల్లోకి వరద నీరు చేరింది. భూపాలపల్లి మండలం ఆజాంనగర్–మీనాజిపేట మధ్యలోని సాంబయ్యమాటు వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహాముత్తారం మండలంలో మధ్యాహ్నం వరకు రాకపోకలు క్లియర్ అయ్యాయి. పోలారం, మహాముత్తారం చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్టులో మూడు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. బొగ్గువాగు ప్రాజెక్టు, వల్లంకుంట వాగుల్లోకి వరద నీరు తరలివస్తుంది. మహాముత్తారం, మహదేవపూర్, కాటారం, మల్హర్, పలిమెల, భూపాలపల్లి, టేకుమట్ల మండలాల్లో భారీవర్షం కురిసింది.
మానేరుకు భారీగా వరదనీరు
మల్హర్: మండలంతో పాటు భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలతో మానేరుకు భారీగా వరదనీరు చేరుకుంది. మండలంలోని చెరువులు, ఎడ్లపల్లి బొగ్గులవాగు, తాడిచర్ల–ఖమ్మంపల్లి మానేరు జలకళ సంతరించుకున్నాయి. ఎడ్లపల్లి బొగ్గులవాగుకు 320 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 155.7 మీటర్ల వద్ద 149.55 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉంది.
ఎడతెరిపి లేని వర్షం
మహాముత్తారం: మండలంలోని పెగడపల్లి, కేశవాపూర్ మధ్య పెద్దవాగు పొంగిపొర్లడంతో మధ్యాహ్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనుకునూర్‌లో ఈదురుగాలులకు పురాతన జువ్విచెట్టు నేలకొరిగింది. పాతరేగులగూడెం గ్రామంలో ఒంటరి మహిళ కాపుల లక్ష్మి పెంకుటిల్లు కూలిపోయింది.
మెట్టపంటలకు ప్రయోజనం...
భూపాలపల్లి రూరల్: వర్షాలు మెట్ట పంటలకు ప్రయోజనకరంగా మారాయి. జూన్‌లో కురిసిన వానలకు జిల్లాలో 1,32707 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఇందులో అత్యధికం మెట్ట పంటలే ఉన్నాయి. పత్తి ఇప్పటివరకు 1,04,940 ఎకరాల్లో సాగుచేయగా, పెసర, కంది, మినుములు, మొక్కజొన్న కూడా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ముసురు ఈ పంటలకు ఉపయోగపడుతున్నాయి.


