రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

రేగొండ: భూముల రీ సర్వేతో అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్‌, సుల్తాన్‌పూర్‌ గ్రామాలలో నిర్వహించిన భూముల రీ సర్వే గ్రామసభల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తామని, ప్రతి రైతు ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలన్నారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందజేయడం ద్వారా రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలు పొందవచ్చన్నారు. మండలంలో సర్‌ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ హేమ, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కిష్టయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు భిక్షపతి, సక్కుబాయి, కిరణ్‌, రమేశ్‌, నాయకులు ఓంప్రకాశ్‌, వీరేందర్‌, మటికే సంతోష్‌, సురేందర్‌రెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.

అవగాహనా రాహిత్యానికి నిదర్శనం

భూపాలపల్లి అర్బన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఎంఎస్‌ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తిగా అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా ఉన్నాయని ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్‌లను వేలం వేసి పెద్ద పారిశ్రామిక సంస్థలకు కేటాయించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. లక్షలాది మంది కార్మికుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టిన ఈ విధానాలపై బీఎంఎస్‌ ఎందుకు మౌనం పాటిస్తుందో సమాధానం చెప్పాలన్నారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం బీఎంఎస్‌ నాయకులకు తగదన్నారు.

ఘనంగా సీత్లా పండుగ

రేగొండ: సీత్లా పండుగను మండలంలోని రామన్నగూడెం తండాలో గిరిజనులు గురువారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామ సమీపంలో ఉన్న అమ్మ వారికి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలంటూ మొక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చందుపట్ల కీర్తిరెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌ రెడ్డి, నాయకులు సంపత్‌, మోహన్‌, రాజేందర్‌, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

గుంతలమయంగా రోడ్డు

మల్హర్‌: మండలంలోని తాడిచర్ల–కొయ్యూరు నాగులమ్మ రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా ఉంది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గుంతలు వర్షపు నీరుతో నిండిపోయాయి. నిత్యం ఈ మార్గంలో వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి వెంటనే మరమ్మతు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

రోడ్డుపై చెట్టును

తొలగించిన పోలీసులు

కాళేశ్వరం: మహదేవపూర్‌–కాళేశ్వరం జాతీయ రహదారి 353(సీ)పైన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతంలో వర్షానికి భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా నేలకూలింది. విషయం తెలుసుకున్న మహదేవపూర్‌ ఎస్సై సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement