భూపాలపల్లి అర్బన్: ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, బోగస్ రేషన్‌కార్డులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కేవైసీ నమోదు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులందరూ ఈనెల 31 నేటి వరకు (శుక్రవారం) తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాలశాఖ అధికారులు స్పష్టంచేశారు. గడువులోగా పూర్తిచేసుకోని వారికి ఆగస్టు నుంచి రేషన్ సరఫరా నిలిచిపోతుందని, కార్డు నుంచి పేర్లు కూడా తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతతో పాటు అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రేషన్‌కార్డుతో ఆధార్ సంఖ్యను అనుసంధానించడం ద్వారా మరణించిన వారి పేర్లను తొలగించడమే కాకుండా, అనర్హులను ఏరివేయడానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదపడనుంది. జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభంలో వేగంగా సాగినప్పటికీ, ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణ తగ్గడంతో కొంత నిర్లక్ష్యం నెలకొంది. దీంతో ఇప్పటికీ వేలాది మంది లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ చేసుకోకుండా ఉండిపోయారు.
రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుతో సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. డీలర్ ఈ–పాస్ యంత్రంలో రేషన్‌కార్డు, ఆధార్ సంఖ్యలను నమోదు చేసిన తర్వాత లబ్ధిదారుల బయోమెట్రిక్ (వేలిముద్ర) లేదా ఐరిష్ స్కాన్ ఇవ్వాలి. వివరాలు సరిగ్గా సరిపోలితే యంత్రంలో ఆకుపచ్చ రంగు లైట్ వెలిగి కేవైసీ నమోదు పూర్తవుతుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే ఎరుపు రంగు లైట్ వెలిగి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు వేలిముద్రలు సరిగ్గా పడవు కాబట్టి వారి ఆధార్ కార్డు ప్రతులను జత చేస్తే సరిపోతుంది. ఉపాధి, ఇతర కారణాలతో ఇతర ప్రాంతాలలో ఉన్నవారు కూడా తమకు సమీపంలో ఉన్న ఏ రేషన్ దుకాణంలోనైనా ఈ–కేవైసీ పూర్తి చేసుకునే సదుపాయం కలదు.
నేటితో ముగియనున్న గడువు
నకిలీ కార్డుల ఏరివేతే లక్ష్యం
కేవైసీ చేయించకుంటే
బియ్యం బంద్
జిల్లాలో 81శాతమే నమోదు


