ఇలా.. ‘నులి’మేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఇలా.. ‘నులి’మేద్దాం

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

ఈ జాగ్రత్తలు మేలు

భూపాలపల్లి అర్బన్‌: పిల్లల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్న నులి పురుగుల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. నులి పురుగుల నిర్మూలనకు జిల్లాలోని 19 ఏళ్ల లోపు పిల్లలు 70,773మందికి నేడు (సోమవారం) ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, పాలిటెక్నిక్‌, ఒకేషనల్‌ కాలేజీలు, మెడికల్‌ కళాశాలలతో పాటు బడి బయట ఉన్న పిల్లలందరికీ ఈ మాత్రలు అందజేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఒకటి నుంచి రెండేళ్ల లోపు పిల్లలకు సగం మాత్ర (200 ఎం.జీ), ఆపై వయస్సు పిల్లలకు ఒక పూర్తి మాత్ర (400 ఎంజీ) వేయనున్నారు. ఈ మాత్రలను ఇప్పటికే ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు.

వ్యాపించే విధానం

మనిషి శరీరంలోకి ఏలిక పాములు, నులి పురుగులు, కొంకెర పురుగులు అనే మూడు రకాల పురుగులు ప్రవేశిస్తుంటాయి. నులి పురుగులున్న వ్యక్తి మల విసర్జన చేయడం ద్వారా అందులోని గుడ్లు నేలలోకి, తద్వారా తాగునీరు, గాలి ద్వారా ఆహార పదార్థాల పైకి చేరుతాయి. తెలియకుండా ఆ నీరు తాగినా, అటువంటి ఆహారం తిన్నా వారి కడుపులోకి ఈ నులి పురుగులు ప్రవేశిస్తాయి. కడుపులో ఈ పురుగులున్న వారు రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, తరచుగా ఇన్‌ఫెక్షన్లకు గురవడం వంటి వాటితో బాధ పడుతుంటారు. వీటి నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు తీసుకోవడం ఒక్కటే మార్గం. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కూడా వీటిని తీసుకోవచ్చు.

నిర్మూలనతో ఇవి ప్రయోజనాలు

నులి పురుగులను నివారిస్తే మనం తింటున్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది. తద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఆరోగ్యం బాగుపడటంతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి కలుగుతుంది. పని చేయగల సామర్థ్యం పెరుగుతుంది.

నేడు నులి పురుగుల నివారణ

కార్యక్రమం

అన్ని కేంద్రాలకూ ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

జిల్లాలో 70,773మంది పిల్లలు

గోళ్లను చిన్నవిగా, శుభ్రంగా ఉంచుకోవాలి.

ఎప్పుడూ శుభ్రమైన నీటిని తాగాలి.

ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూత

ఉంచాలి.

కూరగాయలు, పండ్లను శుభ్రమైన నీటితో కడగాలి.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

బయట తిరిగేటప్పుడు బూట్లు/ చెప్పులు ధరించాలి.

బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయరాదు. ఎప్పుడూ మరుగుదొడ్డినే వాడాలి.

ఏదైనా తినకముందు, తిన్న తర్వాత, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement