పోడు జరుగుతున్న ప్రాంతాలు
భారీగా ఖాళీలు..
అదనపు భారం..
భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఓ వైపు వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు జిల్లాలోని అడవుల్లో పోడు జోరుగా సాగుతతోంది. కొందరు వ్యక్తులు భారీ వృక్షాలను సైతం నేలకూల్చి అత్యంత విలువైన అటవీ భూమిని పోడుచేసి సాగుకు యత్నిస్తున్నారు. ఫలితంగా వందల ఎకరాల్లో పచ్చదనం మాయమవుతోంది.
రంపపు మిషన్ల గర్జన..
దట్టమైన చెట్లు, వన్యప్రాణులతో ఉన్న జిల్లా అటవీ ప్రాంతంలో ఇప్పుడు పోడు జోరుగా జరుగుతోంది. గతంలో గొడ్డళ్లతో చెట్లను నరికి అటవీ భూమిని పోడు చేసేవారు. అటవీ అధికారుల తనిఖీలు ఎక్కువవడం, కేసులు నమోదవుతుండటంతో పోడుదారులు నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. పెట్రోల్‌తో నడిచే రంపపు మిషన్లను రంగంలోకి దించి రాత్రికి రాత్రే ఏళ్ల నాటి భారీ వృక్షాలను సైతం నిమిషాల వ్యవధిలోనే కూల్చి పోడు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా రోజుకింత పోడు జరుగుతూనే ఉంది.
మహాముత్తారం మండలంలోని మహబూబ్‌పల్లి–పోలారం సమీప అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు భారీ వృక్షాలను నరికి పోడు చేసి భూమిని చదును చేశారు. డొబ్బలపాడు మోడల్ పాఠశాల సమీపంలో చెట్లను నరకడమే కాక ఏకంగా అడవికి నిప్పు పెట్టారు.
పలిమెల మండలంలోని పలిమెల, కామన్‌పల్లి, బోడాయిగూడెం, పంకెన, మోదేడు, లెంకలగడ్డ, సర్వాయిపేట, దమ్మూరు, ము కునూరు గ్రామాల సమీపంలో పోడు చేశారు.
ఆజంనగర్ రేంజ్ పరిధిలోని ఎర్రారం సెక్షన్ ప్రేమ్‌నగర్ బీట్, నందిగామ సెక్షన్ గండికామారం నార్త్, సౌత్, నాగారం గ్రామం ఎదురుగా గల అడవిలో ఇంకా పోడు జరుగుతోంది.
భూపాలపల్లి రేంజ్ పరిధిలోని ఆముదాలపల్లి బీట్ నుంచి మొదలుకొని పెద్దాపూర్ 1 వరకు, ఇదే రేంజ్‌లోని రాంపూర్ నార్త్ బీట్‌లోని రాజీవ్‌నగర్ దగ్గర, ఊట్లపల్లి సమీపంలో అటవీ భూమిలోని చెట్లను నరికేశారు.
చెల్పూరు రేంజ్‌లోని గుర్రంపేట జామాయిల్ ప్లాంటేషన్‌ను చెట్లను కొందరు వ్యక్తులు నరికించి పోడు చేసినట్లు సమాచారం. ఈ భూమిలో పోడుదారులు పత్తి గింజలు సైతం నాటినట్లు తెలుస్తోంది.
జిల్లాలో జోరుగా పోడు
పెట్రోల్‌తో నడిచే చెయిన్ రంపం మిషన్‌లతో నరికివేత
నేలకూలుతున్న భారీ వృక్షాలు
వందల ఎకరాల్లో మాయమవుతున్న పచ్చదనం
కొందరు అటవీశాఖ సిబ్బంది సహకారంతో పాటు ఉద్యోగుల కొరత మూలంగా కూడా పోడు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు రెండు, మూడు సెక్షన్లు, బీట్ల బాధ్యతలు చూడాల్సి వస్తుంది. జిల్లాలో 9 రేంజ్‌లు ఉండగా సరిపడా రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు. 42 సెక్షన్లు ఉండగా 8 ఖాళీలు, 170 బీట్లు ఉండగా 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువవుతోంది.


