● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల నియంత్రణలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్ సెక్యూరిటీ వింగ్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు, విచారణ పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు అందిస్తున్న సేవలు, సైబర్ నేరాల నివారణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన ప్రతీ సైబర్ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పిస్తూ, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.


