అక్రమ వసూళ్లకు అడ్డెవరు?
ఎవరూ లేని చోట వసూలు..
అధికారులు
వస్తారంటే..
రోడ్లపైనే ఇసుక మాఫియా దందా
కాళేశ్వరం: ఇసుక మాఫియా అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయడంలో సంబంధిత అధికారులు వెనుకా డుతున్నారు. ఎక్స్‌ట్రా బకెట్ దందా నిలిచిపోయినా తమ లాభార్జనే ధ్యేయంగా ఇసుక రీచ్‌లకు వచ్చే లారీ డ్రైవర్ల వద్ద రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధికారుల అండతో కాంట్రాక్టర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కాంట్రాక్టర్లకున్న రాజకీయ పలుకుబడితో వసూళ్లకు రెచ్చిపోతున్నట్లు వినికిడి. మహదేవపూర్ మండలంలో బొమ్మాపూర్, పలుగుల–8, పూస్కుపల్లి మూడు ఇసుక క్వారీల్లో వందలాదిగా తరలివచ్చే లారీల వద్ద కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు.
బుజ్జగింపు ఎందుకు..?
మహదేవపూర్ మండలకేంద్రానికి చెందిన ఓ లారీ ఓనర్ తన వద్ద ఇసుక రీచ్ కాంట్రాక్టర్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళితే సదరు పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని సమాచారం. ఆ తరువాత టీజీఎండీసీ అధికారి ఫిర్యాదుతో పాటు లారీ నిర్వాహకులతో ఫిర్యాదు ఇవ్వకుండా బతిమిలాడినట్లు తెలిసింది. ఫిర్యాదు ఇవ్వకుండా ఇంత బుజ్జగింపులు ఎందుకు చేస్తున్నారో అధికార యంత్రాంగం అర్థఽం చేసుకొని చర్యలకు రంగం సిద్ధం చేయాలని పలువురు లారీడ్రైవర్లు కోరుతున్నారు.
ఇసుక రీచ్‌లకు వచ్చే లారీడ్రైవర్ల వద్ద క్వారీకి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఎవరూ లేని చోటనే అడ్డాగా లోడింగ్ పేరిట అక్రమంగా రూ.2వేల నుంచి 3వేల వరకు ఒక్కో లారీకి కాంట్రాక్టర్ల సిబ్బంది వసూలుకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్లు కొత్త ఎత్తుగడతో క్వారీల వద్ద డబ్బులు వసూలు చేయడం లేదని అధికారులకు వీడియో కాల్ చేసి లారీడ్రైవర్లతో మాట్లాడించడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకరిద్దరు లారీడ్రైవర్లతో ‘మా వద్ద ఎలాంటి డబ్బులు తీసుకోలేదు’ అని వీడియో చిత్రీకరించి అధికారులకు చూపిస్తూ తమపైకి ఫిర్యాదు రాకుండా చూసుకుంటున్నారు. దీంతో ఉన్నతాధికారులు నిజమే అని నమ్ముతూ గమ్మునుంటున్నట్లు తెలిసింది.
విజిలెన్స్, మైనింగ్ ఉన్నతాధికారులు వస్తున్నారని రీచ్‌లలో ముందుగానే సమాచారం అందుతుంది. ఆ రోజు ఆ తనిఖీ బృందాలు వెళ్లే వరకు లోడింగ్ నిలిపివేస్తున్నారు. ఎంత రాత్రి వరకు ఉంటే అప్పటి వరకు వారు వెళితే తప్ప లోడింగ్ జరగడం లేదు. దీంతో వారి స్వంత ఖజానాకు పైసలు నిండే వరకు లోడింగ్ ఆగాల్సిందే అన్నట్లు ఉంది. ఇంత నెట్‌వర్క్ మెయింటెన్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు. ఇదంతా స్థానికంగా ఉండే టీజీఎండీసీ కనుసన్నల్లోనే జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై పీఓ రామకృష్ణను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
డబ్బులు ఇవ్వడం లేదని
లారీడ్రైవర్లతో వీడియో కాల్
తనిఖీలకు అధికారులు వస్తే
లోడింగ్ నిలిపివేత
టీజీఎండీసీ కనుసన్నల్లోనే
వ్యవహారం
అక్రమ వసూళ్లకు అడ్డెవరు?


