నిద్ర మత్తులో ‘నిఘా’
వసూళ్లపై కట్టడి ఏది?
● ఇసుక అక్రమ వసూళ్లపై గప్‌చుప్
● విజిలెన్స్ బృందాల
జాడెక్కడ
కాళేశ్వరం: జిల్లాలో ఇసుక అక్రమ వసూళ్లపై నిఘా, విజిలెన్స్ బృందాలు నిద్రమత్తులో ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక రీచులలో జరుగుతున్న బహిరంగ అక్రమ దందాపై సంబంధిత శాఖలు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు విజిలెన్స్, నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయకపోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. కాంట్రాక్టర్ల సిబ్బంది ఒక్కో క్వారీలో రోజుకు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. టీజీఎండీసీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
వారికో ‘లక్కీ లైన్’
సంబంధిత శాఖల నిఘా, విజిలెన్స్ అధికారులు స్థానికంగా ఉండకుండా ఇతర పట్టణాల్లో నివసిస్తూ కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే ఆధారపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వారానికి రెండుసార్లు వస్తుండడంతో.. ఫలితంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఇది లూప్‌లైన్ కాదు.. ఒక లక్కీ లైన్‌గా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి అక్రమ ఇసుక వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలని పలువురు కోరుతున్నారు. టీజీఎండీసీ అధికారులు, అధికారులు దృష్టి సారిస్తే అక్రమ వసూళ్లు ఆగిపోయే అవకాశం ఉంది. పూస్కుపల్లి క్వారీ నిలిచినట్లు తెలిసింది. మిగితా, పలుగు–8, బొమ్మాపూర్ క్వారీల్లో లోడింగ్ జరిగింది.
ఇసుక రీచులలో ఎక్స్‌ట్రా బకెట్ దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఆదేశాలు జారీచేసిన సమయంలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా మూడు విడతల్లో విధులు నిర్వర్తించి అక్రమాలకు కట్టడి చేయగలిగాయి. ప్రస్తుతం మహదేవపూర్ మండలంలోని బొమ్మపూర్, పూసుకుపల్లి, పలుగుల–8 ఇసుక క్వారీ రీచులలో పరిస్థితి మారింది. సంబంధిత కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్ల నుంచి ఒక్కో వాహనానికి రూ.2,000 నుంచి రూ.3,000 వరకు లోడింగ్ పేరిట వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవని సమాచారం.
నిద్ర మత్తులో ‘నిఘా’
నిద్ర మత్తులో ‘నిఘా’


