వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొర్లవీడులో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఫర్నిచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం హెచ్‌ఎం అనిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్ బెంచీలు, సైన్స్ లాబరేటరీ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, ఫర్నిచర్ అందించి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తూ పరోక్షంగా విద్యార్థుల ప్రగతికి సహకార అందిస్తున్నారన్నారు. వారి సేవలు మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని కోరారు. ట్రస్ట్ రిసోర్స్ మొబిలైజేషన్ డైరెక్టర్ లీల సుజిత్ మాట్లాడుతూ భవిష్యత్‌లో దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న విద్యార్థుల కోసం సైకిళ్లు అందజేస్తామన్నారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ భాస్కర్, సర్పంచ్ మందల లావణ్య, సంస్థ ప్రతినిధులు పింగిలి విజయపాల్ రెడ్డి, రమేష్, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సుభాకర్ రెడ్డి, వంశీ, కుమారస్వామి, శంకర్‌రావు, వాసుదేవ్, నవనీత్ మాలతి, రియాజ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు ఊరట్టం గ్రామ పంచాయతీలో రేపు (9వ తేదీన) తైబజారు ఓపెన్ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొమరం శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఊరట్టం, కొత్తూరు, కన్నెపల్లి గ్రామాల పరిధిలో గల దుకాణాలకు వేలం పాట ఉంటుందని వివరించారు. జీపీలో ఉదయం 10: 30 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ. 50వేల డిపాజిట్ సొమ్మును జీపీ కార్యాలయంలో చెల్లించాలని వివరించారు.


