సరిపడా యూరియా సరఫరా
భూపాలపల్లి: రాష్ట్రానికి కేంద్రం నుంచి సరిపడా యూరియా పంపిణీ అవుతుందని, కొంతమంది దళారులు కొరత సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం భూపాలపల్లికి వచ్చిన సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం, గ్యాస్ సబ్సిడీ తదితర పథకాలన్నీ కేంద్రం ఇస్తున్నవేనని అన్నారు. భూపాలపల్లికి జాతీయ రహదారి మంజూరు చేశామని, ఎఫ్‌సీఐని పునరుద్ధరించి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కేటీపీపీ, సింగరేణి భూ నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందలేదని చెప్పారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు సకాలంలో ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. గతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో అవినీతికి ప్రోత్సాహం ఇస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లాలో సుమారు వంద వార్డు స్థానాలు బీజేపీ కై వసం చేసుకోవడం హర్షనీయమన్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ పథకం కింద దేశంలోని అన్ని పట్టణాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈ ఒక్కసారి బీజేపీని ఆదరిస్తే భూపాలపల్లికి భారీగా నిధులు మంజూరు చేస్తామని రాంచందర్‌రావు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నాయకులు వీరేందర్‌గౌడ్, నిషిధర్‌రెడ్డి, పాపయ్య, నారాయణరెడ్డి, యుగేందర్, గౌతమ్‌రావు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే
రైతులకు ఇబ్బందులు
మున్సిపల్ ఎన్నికల్లో
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్ రాంచందర్‌రావు


