ప్రథమ స్థానంలో నిలవాలి
భూపాలపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భూపాలపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సకాలంలో ఫొటో క్యాప్చర్ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓలు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాలని సూచించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించకుంటే రద్దు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
నిర్మాణాలకు రుణ సదుపాయం..
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పరిస్థితులు లేని లబ్ధిదారులకు లక్ష రూపాయల సహాయం అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల ఖర్చులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిధుల సమస్య ఏమీ లేదని, బిల్లులు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తే నిధులు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ప్రగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ డీఈ శ్రీకాంత్, అధికారులు ఉన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణరావు


