బొమ్మాపూర్‌ క్వారీ లోడింగ్‌ నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

బొమ్మాపూర్‌ క్వారీ లోడింగ్‌ నిలిపివేత

Jan 10 2026 9:11 AM | Updated on Jan 10 2026 9:11 AM

బొమ్మ

బొమ్మాపూర్‌ క్వారీ లోడింగ్‌ నిలిపివేత

మీటర్లు మార్చిన ఉద్యోగి సస్పెన్షన్‌

కాళేశ్వరం: జిల్లాలోని మహదేవపూర్‌ మండలంలో ఇసుక క్వారీల్లో అక్రమ లోడింగ్‌ పేరిట లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా శుక్రవారం బొమ్మాపూర్‌ క్వారీలో లోడింగ్‌ను సంబంధిత శాఖ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. వారం రోజులుగా సాక్షి పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించి అంతర్గతంగా నిఘా వర్గాలతో విచారణ జరిపారు. లోడింగ్‌ పేరిట అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు తేలడంతో పాటు ఫిర్యాదులు రావడంతో క్వారీకి సంబంధించిన అగ్రిమెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. శుక్రవారం మరో రెండు క్వారీల్లో పలుగుల–8, పూస్కుపల్లి క్వారీల్లో లోడింగ్‌ యథావిధిగా జరుగుతుంది. ఈ విషయంపై టీఎండీసీ పీఓ రామకృష్ణను ఫోన్‌లో సంప్రదించగా.. తమకు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో బొమ్మాపూర్‌ క్వారీ అగ్రిమెంట్‌ పూర్తి కాగా, అగ్రిమెంట్‌ ఎక్స్టెన్షన్‌ను నిలిపివేసినట్లు తెలిపారు.

హన్మకొండ: మీటర్లు మార్చి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడిన టీజీ ఎన్పీడీసీఎల్‌ భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్‌ ఉద్యోగి చిల్లా శ్రీరామ్‌ను భూపాలపల్లి ఎమ్మార్టీ డీఈ సదానందం శుక్రవారం సస్పెండ్‌ చేశారు. డిసెంబర్‌ 16న డీపీఈ ఏఏఈ ఎల్‌.రాజమౌళి హనుమకొండ న్యూ రాయపురాలోని సిల్లా సుజాత ఇంటిని తనిఖీ చేశారు. ఆ సమయంలో మంజూరైన మీటర్‌కు, అమర్చిన మీటర్‌కు తేడా ఉన్నట్లు గుర్తించి, వినియోగదారురాలను విచారించారు. దీంతో ఆమె భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్‌లో పని చేస్తున్న తన కుమారుడు చిల్లా శ్రీరామ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అదే ఫోన్‌ను తనిఖీకి వచ్చిన అధికారికి ఇవ్వగా ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ఇంట్లో భద్రపర్చిన అసలు మీటరును తీసుకొచ్చి తనిఖీ అధికారికి చిల్లా సుజాత అప్పగించారు. వెంటనే ఈ విషయాన్ని ఆపరేషన్‌ యాదవనగర్‌ ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వచ్చి మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడినందుకు రూ.1,12,200 జరిమానా విధించారు. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్‌లో పని చేస్తున్న శ్రీరాం మీటర్‌ మార్చినట్లు తెలిసినా సంబంధిత డీఈ 25 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడేందుకు యత్నించారనే ఆరోపణలున్నాయి. ఈ నెల 9న సాక్షిలో ‘సొంత సంస్థకు కన్నం’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించిన టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం సంబంధిత డీఈని ఎందుకు చర్య తీసుకోలేదని మందలించినట్లు తెలిసింది. దీంతో ఎట్టకేలకు విద్యుత్‌ చౌర్యానికి కారకుడైన ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు.

యుద్ధప్రాతిపదికన ఆలయ పనులు

రేగొండ: కొడవటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై శుక్రవారం కొడవటంచ ఆలయ ప్రాంగణంలో కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఫిబ్రవరి నెలలో స్వామి వారి పునఃప్రతిష్ట, స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నట్లు తెలిపారు. అంతకుముందు బాలాలయంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మీ, ఆలయ ఛైర్మన్‌ భిక్షపతి, ఈఓ మహేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కిష్టయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పర్యాటకుల జోష్‌..

గోవిందరావుపేట: మండలంలోని లక్నవరంలో పర్యాటకులు శుక్రవారం సందడి చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు లక్నవరం సరస్సుకు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ప్రకృతి అందాలను చూసి తరించారు. వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్‌ పాయింట్‌కు చేరుకున్నారు.

బొమ్మాపూర్‌ క్వారీ  లోడింగ్‌ నిలిపివేత
1
1/2

బొమ్మాపూర్‌ క్వారీ లోడింగ్‌ నిలిపివేత

బొమ్మాపూర్‌ క్వారీ  లోడింగ్‌ నిలిపివేత
2
2/2

బొమ్మాపూర్‌ క్వారీ లోడింగ్‌ నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement