మొక్కజొన్న సాగుకే మొగ్గు
పెట్టుబడి, కూలీల
ఖర్చు తక్కువ
రేగొండ: యాసంగి సీజన్‌లో రైతులు మొక్కజొన్న పంట సాగుపై మొగ్గు చూపడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది. నీటి సౌకర్యం ఉన్న రైతులు మొక్కజొన్నపైనే మక్కువ చూపుతున్నారు. రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల వ్యాప్తంగా దాదాపు 5వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అడవి పందుల బెడద ఉన్నప్పటికీ వాటి నుంచి రక్షించుకునేందుకు సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకుని మరీ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు, కూలీల ఖర్చు తక్కువ, స్థిరమైన ఆదాయం రావడంతో రైతులు ఈ పంటలను ఎంచుకుంటున్నారు. కూరగాయల సాగుకు కూలీ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. దీంతో పాటు స్థిరమైన ఆదాయం రాకపోవడంతోనే రైతుల చూపు ఆదాయం వచ్చే పంటలపై మరలుతోంది.
ఖరీఫ్ నుంచి రబీలో..
ఒకప్పుడు ఖరీఫ్‌లో మొక్కజొన్న సాగు చేసేవారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు ఇబ్బందిగా మారుతుండటంతో రబీలో సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఈ పంటకు మార్కెట్‌లో సరైన డిమాండ్ ఉంది. మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.2,350 ధర పలుకుతోంది. రబీలో దిగుబడులు ఆశించిన స్థాయిలో వస్తుండడంతోనే దీనిపై మక్కువ చూపుతున్నారు.
మండల పరిఽధిలో..
రేగొండ మండల పరిధిలోని కనిపర్తి, నాగుర్లపల్లి, లింగాల, రేపాక, తిరుమలగిరి కొత్తపల్లిగోరి మండల పరిధిలో కొత్తపల్లిగోరి, నిజాంపల్లి, జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి తదితర గ్రామాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం మద్దతు ధర రూ.2,350 ఉండగా, రేగొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. రైతులు మార్కెట్‌కు తరలించకుండా, దళారుల పాలు కాకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం వల్లే ప్రస్తుతం మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది.
వానాకాలం పత్తి సాగులో ఆశించిన దిగుబడులు రాలేదు. దీంతో యాసంగిలో ఐదు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నాను. ఇతర పంటల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. తక్కువ పెట్టుబడితో మొక్కజొన్న సాగుతో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుపైన రైతులకు అవగాహన కల్పించాలి.
– వన్నాల శివాజీ, రైతు, కొత్తపల్లిగోరి
యాసంగిలో పెరిగిన సాగు విస్తీర్ణం
ఆసక్తి చూపిస్తున్న రైతులు
మొక్కజొన్న సాగుకే మొగ్గు


