సహకార ఎన్ని‘కలే’నా..?
ఇప్పటి నుంచే ప్రయత్నాలు
సొసైటీ పాలకవర్గ పదవులు నామినేటెడ్ చేసే యోచనలో ప్రభుత్వం
భూపాలపల్లి అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్ ప్రతిపాదికన ఎన్నుకుంటారనే చర్చ జిల్లావ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఇటీవల ఆయా పాలకవర్గాలను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు డీసీసీబీ చైర్మన్, పాలకవర్గాన్ని ఎన్నుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహకార సొసైటీల పదవులను నామినేటెడ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలియడంతో నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయ్యారు. గ్రామీణ స్థాయిలో డిమాండ్ ఉన్న పదవి కావడంతో సహకార ఎన్నికలు హోరాహోరీగా సాగేవి. కానీ ప్రస్తుతం పదవులను నామినేట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వరంగల్, హైదరాబాద్ దారిపట్టిన నాయకులు తమ పేర్లు నామినేట్ చేయాలని కోరుతున్నారు.
కొత్త సొసైటీల కోసం..
జిల్లాలో సహకార సంఘాలను పెంచేందుకు ఇప్పటికే కసరత్తు జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 11 సహకార సొసైటీలు ఉన్నాయి. కానీ సహకార పదవులు నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వనున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలకు చెందిన రైతులు అఖిల పక్షాల ఆధ్వర్యంలో తమ గ్రామం కేంద్రంగా సొసైటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు టేకుమట్ల, కొత్తపల్లిగోరి మండలాల్లో మండలం పేరిట సొసైటీ లేదు. ఇక్కడ సొసైటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం చేసింది. అధికార పార్టీ నాయకుల మధ్య డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులతో పాటు అన్ని సహకార సంఘాల్లో చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోసం పోటా పోటీ నెలకొన్నది. జిల్లాలో మరికొన్ని గ్రామాలకు సొసైటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో
చిగురిస్తున్న ఆశలు
జిల్లా నాయకుల మద్దతు
కూడగట్టుకునే యత్నం
పీఏసీఎస్‌లను రద్దు చేసిన తరువాత నామినేటెడ్ పద్ధతిలో డైరెక్టర్లు, చైర్మన్ల నియమాకాలు చేపడుతారని ఊహాగానాలు రావడంతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ సహకార సంఘాల పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సహకార ఎన్నికల్లో సైతం సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఎన్నికలు జరిగేవి.


