గొంతెమ్మ గుట్టపై పురాతన చిత్రకళ
మల్హర్(కాటారం): కాటారం మండలం ప్రతాపగిరి శివారులో ఉన్న గొంతెమ్మ చిన్న గుట్టపై పురాతన చిత్రకళ ఆనవాళ్లను గుర్తించినట్లు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తతంగా పర్యటించి ఆది మానవుల చరిత్రను, సంస్కతిని రికార్డు చేస్తున్న డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, టీం సభ్యులతో కాటారంలో గొంతెమ్మ గుట్టను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్న గుట్ట కుంతి దేవికి అంకితం చేయబడిందని.. అందుకే గొంతెమ్మ గుట్టగా పిలుస్తారని పేర్కొన్నారు. కృష్ణుడు, సుభద్ర, కుంతీదేవి కొంతకాలం ఇక్కడ జీవించారని స్థల పురాణం చెబుతుందన్నారు. 18.62495 అక్షాంశం, 80.01390 రేఖాంశముల మధ్య ఉన్న పడగ రాయి కింద ఆది మానవులు వేసిన పల్లికాయను పోలి ఉన్న గంటు చిత్రం (పెట్రోగ్లిప్) ఉందన్నారు. ఇది పల్లి చేను పీకినప్పటి దశను సూచిస్తుందని చెప్పారు. గుట్టపైకి ఎక్కే క్రమంలో డిస్కవరీ టీం సభ్యులకు మధ్య శిలాయుగానికి చెందిన సూక్ష్మ రాతి పనిముట్లు లభించాయని తెలిపారు. ఈ పనిముట్లను బట్టి ఈ చిత్రం సామాన్య శక పూర్వం 10 నుంచి 5 వేల మధ్య కాలానికి చెందినదై ఉంటుందని ఆయన వెల్లడించారు. పడగ రాయి కింద ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన ఆలయం ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని షెల్టర్ గానూ, సెంట్రీ పాయింట్ గాను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోందని చెప్పారు. అప్పుడే ఇక్కడ శివలింగమును స్థాపించినట్లు తెలుస్తోందన్నారు. గుడి ముందు ఉన్న పాదాలను కృష్ణుని పాదాలుగా భావిస్తారని అన్నారు. గుడి వెనుక గోడలో మహిషాసుర మర్ధిని శిల్పం, గుడి లోపల పై శిలకు పువ్వు శిల్పం ఉందని చెప్పారు. పువ్వు శిల్పం సౌభాగ్యం, లక్ష్మీదేవికి ప్రతీక అన్నారు. ఈ పల్లికాయ చిత్రమే లక్ష్మీదేవికి ప్రతీకగా భావించి ఈ గొంతెమ్మ గుట్టపై ప్రతి ఏటా లక్ష్మీదేవర కల్యాణం ఘనంగా చేస్తారని వివరించారు. గ్రామస్తులంతా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క లక్ష్మీదేవరతో ఊరేగింపుగా బయలుదేరి గొంతెమ్మ గుట్టకు చేరుకుంటారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసులు, స్థానిక గ్రామాల వాళ్లు పాల్గొంటారని అన్నారు. ఈ క్రమంలో భక్తులు తమ కోరికలు నెరవేరిన సందర్భంలో పడగ రాయి కింద పాదాల చిత్రాలను వేయించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. గుట్టపై మూడు దశల్లో నిర్మించిన కోట గోడలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పారం రాజు, అడ్లకొండ రాజేష్, వినయ్ గోలి, నాగరాజు, మహేశ్, అనిరుద్, స్థానిక యువకులు ఉన్నారు.
వారసత్వ సంపదగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలి
డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి
గొంతెమ్మ గుట్టపై పురాతన చిత్రకళ


