సీఎం కప్.. వేళాయె..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండో విడత క్రీడాపోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో షెడ్యూల్‌ను ప్రకటించింది. మొదటగా గ్రామ పంచాయతీ స్థాయిలో 17నుంచి క్రీడలు మొదలుపెట్టి రాష్ట్రస్థాయి పోటీలు ఫిబ్రవరి 26న ముగించనుంది. మొదటి విడత అట్టహాసంగా నిర్వహించిన సీఎం కప్ క్రీడలను మరోసారి అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ, క్రీడా సంఘాలు, రాష్ట్రస్థాయి క్రీడా అధికారులతో జూమ్ సమావేశాలు నిర్వహించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్‌తో పాటు పారా గేమ్స్ కూడా నిర్వహించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా టార్చ్ ర్యాలీలు..
క్రీడల సన్నాహాల కోసం టార్చ్ ర్యాలీలు నిర్వహించాలని జిల్లా క్రీడల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జనవరి 8 నుంచి 17 వరకు గ్రామ, మండల స్థాయిల్లో టార్చ్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లోని గ్రామాలు, మండలాలను కవర్ చేసేలా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రముఖక్రీడాకారులు, మాజీ అథ్లెట్స్, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిదులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా ఒలింపిక్ సంఘాలు, క్రీడా సంఘాలు, యువత, విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు.
17 నుంచి మొదలుకానున్న క్రీడలు
ఈ నెల 17 నుంచి సీఎం కప్ 2వ విడత క్రీడలను ప్రారంభించనున్నారు. మొదటగా గ్రామ పంచాయతీ స్థాయిలో 17 నుంచి ఈ నెల 22 వరకు ఆరు రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. అనంతరం మండలస్థాయిలో జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు జిల్లాస్థాయి క్రీడలను నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలను ఫిబ్రవరి 19 నుంచి 26వరకు 8 రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు.
సుమారు 44 క్రీడాంశాల్లో పోటీలు
సీఎం కప్ 2వ విడత పోటీలు సుమారు 44 క్రీడాంశాలలో నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో తదితర గ్రామీణ స్థాయి క్రీడలతో పాటు ఇతర క్రీడలను సైతం నిర్వహించనున్నారు. పారా గేమ్స్ కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీలను సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలలో క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. మొదటి విడత సీఎం కప్ అందరి భాగస్వామ్యంతో జిల్లాలో విజయవంతం కావడంతో మరోసారి సీఎం కప్‌ను ఉత్సాహంగా నిర్వహించేందుకు జిల్లా క్రీడా అధికారులు సమాయత్తం అవుతున్నారు.
రెండో విడత సీఎం కప్ పోటీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు సీఎం కప్ పోటీల నిర్వహణ ఉంటుంది. గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నాం. మండల, జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను పంపనున్నాం. సీఎం కప్ పోటీల నిర్వహణలో అందరినీ భాగస్వామ్యం చేసి విజయవంతం చేస్తాం.
– సీహెచ్ రఘు,
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి
సుమారు 44 క్రీడాంశాలు..
సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు
గ్రామ పంచాయతీ, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా,
రాష్ట్ర స్థాయిల్లో నిర్వహణ
సీఎం కప్.. వేళాయె..


