వ్యూహాలకు పదును | - | Sakshi
Sakshi News home page

వ్యూహాలకు పదును

Jan 9 2026 7:30 AM | Updated on Jan 9 2026 7:30 AM

వ్యూహ

వ్యూహాలకు పదును

వ్యూహాలకు పదును మున్సిపల్‌ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తం

రంగంలోకి దిగిన ఆశావహులు

మున్సిపల్‌ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తం

మున్సిపల్‌ ఎన్నికల నగారా త్వరలో మోగనున్నందున ఈ ఎన్నికల్లో గెలుపునకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల సంఘం ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించగా 12న తుది జాబితా వెలువరించనుంది. అనంతరం రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది.

– భూపాలపల్లి అర్బన్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన పార్టీకి సాధారణ ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం ఉందని పార్టీల నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాల కోసం అధికార పార్టీ సహా ఇతర పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి సారించాయి. వారం రోజులుగా మున్సిపాలిటీలో పెండింగ్‌ పనులు, నూతన పనులకు నిధులు కేటాయించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుండగా బీఆర్‌ఎస్‌ పార్టీ వార్డుల వారీగా బస్తీబాట నిర్వహిస్తోంది.

ఖర్చును బట్టి టికెట్‌

ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయగలరనే దాన్ని బట్టి టికెట్‌ కేటాయింపులకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆశావహులతో పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ వార్డుకు ఎంతమంది పోటీ పడుతున్నారనే విషయంపై స్పష్టత తెస్తున్నట్టు సమాచారం. పోటీ ఎక్కువగా ఉండే వార్డుల్లో గెలుపు కోసం ఎవరు ఎంత ఖర్చు చేయగలరని వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ.20లక్షలు ఖర్చు చేసేవారే పోటీలోకి దిగాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్న వారి వార్డుల్లో టికెట్‌ ఆశించే వారిని నొప్పించకుండా సర్దిచెప్పి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

పొత్తులకు కసరత్తులు

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ మినహా ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. వార్డుల వారీ రిజర్వేషన్లు సైతం ఖరారు కావడమే ఆలస్యం ఆయా వార్డుల్లో ఉన్న ఓటర్ల సంఖ్య గెలుపోటముల అంచనాలకు అనుగుణంగా పొత్తులుంటాయని, జాతీయ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీల ప్రభావం అంతగా ఉండదని, ఎన్నికపై ఓటర్లు వ్యక్తుల వ్యక్తిత్వానికే పట్టం కడతారనే ఆలోచనతో గెలుపే లక్ష్యంగా పట్టణంలో పొత్తులు ఉండే అవకాశముందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. భూపాలపల్లిలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఎం ఎన్నికల పొత్తుపెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

శంకుస్థాపనల్లో అధికార పార్టీ బిజీ

బస్తీబాటలో బీఆర్‌ఎస్‌ పార్టీ

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనతో ఉన్న పలు పార్టీల నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆశావహుల సంఖ్య ఈ సారి ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ నుంచి టికెట్‌ ఆశించే వారు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు నలుగురు టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపాలిటీపై పట్టున్న బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు అధిక శాతం మంది బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పొత్తుల ద్వారా లాభపడాలని సీపీఎం, బీజేపీ యోచిస్తుండగా సీపీఐ నుంచి మరికొంత మంది పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలామంది ఆయా పార్టీల నుంచి ఆశావహులు బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.

వ్యూహాలకు పదును1
1/1

వ్యూహాలకు పదును

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement