వామ్మో.. సర్పంచ్ గిరి
గ్రామ పంచాయతీలలో నిధుల లేమి
కాళేశ్వరం: కొత్త సర్పంచ్‌లు గ్రామపంచాయతీల్లో నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మోస్తూ గ్రామ సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు బిత్తరబోతున్నారు. రెండేళ్లుగా కార్యదర్శులు తన డబ్బులను పెట్టి అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం పనుల కోసం సర్పంచ్‌లు స్వంతంగా రూ.లక్షలు పెట్టుబడులు పెడుతున్నారు.
ఖర్చులు తడిసి మోపెడు..
గ్రామాల్లో రోజువారీ అవసరాలు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో కొంతమంది కొత్త సర్పంచ్‌లు లక్షల రూపాయలు స్వయంగా పెట్టుబడిగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వీధిదీపాల బిల్లులు, నీటి మోటార్లు, చెత్త సేకరించే ట్రాక్టర్ల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వంటి ఖర్చులు సర్పంచ్‌లే భరించాల్సి వస్తోంది. దీంతో జిల్లాలోని పలు పంచాయతీల సర్పంచ్‌లు ఇప్పటికే ఎన్నికల కోసం తెచ్చిన అప్పులు కట్టలేక.. పంచాయతీల్లో నిధుల లేమితో ఇటు మళ్లీ అప్పులు తీసుకురావాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
కార్యదర్శులు అంతే..
రెండేళ్లుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు పాలన చేపట్టారు. దీంతో కార్యదర్శులు పూర్తిస్థాయిలో పంచాయతీ బాధ్యతలు తమమీద వేసుకున్నారు. నిధులు లేకపోయినా పనులు నిలిపివేయలేక తమ జేబుల నుంచి ఖర్చులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు. ఫలితంగా వారు అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. నిధులు వస్తే బిల్లులు వచ్చి అప్పులు తీర్చుకుంటామని ఎదురుచూస్తున్నారని తెలిసింది.
స్పష్టత కరువు..
నిధులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడం, ఇప్పటికే చేసిన ఖర్చులు ఎలా తిరిగివస్తాయో తెలియక సర్పంచ్‌లు, కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బకాయిలను విడుదల చేసి గ్రామ పంచాయతీలకు ఊతమివ్వాలని, లేకపోతే గ్రామ పాలన పూర్తిగా కుంటుపడే ప్రమాదం ఉందని ప్రజాప్రతినిధులు ఆందోళన పడుతున్నారు.
15వ ఆర్థిక సంఘం, ఇతర నిధులు కేంద్రం త్వరితగతిన విడుదల చేయాలి. పంచాయతీల్లో నిధులు లేక అప్పులు తెచ్చి పనులు చేయాల్సి వస్తుంది. ట్రాక్టర్లకు మరమ్మతులు, వీధిదీపాలు, నీటిమోటార్లు, పారిశుద్ధ్యంపై ఖర్చులు పెరిగాయి. రెండేళ్ల తరువాత పంచాయతీలకు సర్పంచ్‌గా ఎన్నికై నిధుల సమీకరణకు కొత్తగా అప్పులు తీసుకుంటున్నాం. నిధుల విడుదల జరిగితే సర్పంచ్‌లకు ఊరట కలుగుతుంది. గ్రామంలో అభివృధ్ది జరుగుతుంది.
– మాట్ల శ్రీనివాస్, సర్పంచ్, టేకుమట్ల
15వ ఆర్థిక సంఘం నిధుల కోసం
ఎదురుచూపు
రూ.లక్షల పెట్టుబడులు పెడుతున్న
కొత్త సర్పంచ్‌లు
రెండేళ్లుగా కార్యదర్శులు ఖర్చులు పెట్టి అప్పులతో సతమతం
కొత్త పంచాయతీలకు తడిసిమోపెడు..


