మీ పేరుందా?
ఇప్పటివరకు
73 ఫిర్యాదులు
భూపాలపల్లి అర్బన్: పురపాలక ఎన్నికల పోరుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. పురపాలికలో ఓటర్లు పేర్లు చూసుకునే పనిలో ఉన్నారు. జాబితాలో పలు రకాల తప్పులు నమోదయ్యాయి. ఒక వార్డులోని ఓటర్లు మరో వార్డు జాబితాలోకి, మరికొందరివి రెండు, మూడు వార్డుల్లో నమోదయ్యాయి. మరోవైపు జాబితాలో ఉన్న పేర్లు పోర్టల్‌లో కనిపించకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఆయా వార్డుల్లో వాటిపై అభ్యంతరాలు తెలిపే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. అభ్యంతరాలుంటే పురపాలిక కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలి. అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తుది జాబితాను ఈనెల 10న ప్రచురిస్తారు. సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ఆన్‌లైన్‌లో చూసుకొనే విధానం
https://tsec.gov.in పోర్టల్ ద్వారా ఓటర్ల పేర్లు సరిచూసుకోవచ్చు. పోర్టల్‌లో మెనూ ఆప్షన్ ఎంచుకొని డౌన్‌లోడ్ ఓటరు స్లిప్ బై ఎపిక్ ఐడీని ఎంచుకోవాలి. ఇందులో జిల్లా, పురపాలక, వార్డు, ఎపిక్ నంబరును నమోదుచేస్తే వివరాలు కనిపిస్తాయి. జాబితాలో పేరులేని వారు పురపాలిక కార్యాలయంలో ఈ నెల 10 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కొత్త వారికి ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. సాధారణ ఎన్నికల జాబితానే కీలకమని అధికారులు చెబుతున్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో వివిధ వార్డుల నుంచి సోమవారం వరకు 73 ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు అభ్యంతరాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. 20కిపైగా ఓటరు జాబితాలో పేరు కనిపించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు
అవకాశం
అభ్యంతరాలు తెలిపేందుకు గడువు
ఈనెల 10న తుది జాబితా


