ముసాయిదాపై గుస్సా!
మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు
సాక్షిప్రతినిఽధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇందులో 9 మున్సిపాలిటీలు పాతవి కాగా, కొత్తగా ఏర్పడిన ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురణ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫిర్యాదులు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంగళవారం వరకు అభ్యంతరాల సంఖ్య 509కి చేరింది. మొదట ఐదో తేదీ వరకే స్వీకరించనున్నట్లు చెప్పిన అధికారులు ఆ తర్వాత ఈ నెల 8 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దీంతో వార్డుల వారీగా అభ్యంతరాల సంఖ్య పెరుగుతోంది.
ఓటర్ల జాబితాలో అంతా గందరగోళం..
మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకటించిన ము సాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు తొలగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి పొరుగు గ్రామాలకు మకాం మార్చిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటంపై అభ్యంతరాలున్నాయి. మహబూబాబాద్, జనగామ తది తర మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నివాసం ఉంటున్న వారి ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చాలాచోట్ల చనిపోయిన వారి పేర్లతోపాటు విదేశాలకు వెళ్లిన వారివి కూడా ఉన్నట్లు ఫిర్యాదులుండగా.. ఒకే ఇంటివారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండడం, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లడంపై అభ్యంతరాలు ఉన్నాయి.
పరకాలలో వార్డులు మార్చాలనే ఫిర్యాదులు..
పరకాల మున్సిపాలిటీ పరిధిలో 11 అభ్యంతరాలు వచ్చాయి. అందులో తమ ఓట్లు మరో వార్డులో వచ్చాయని.. వాటిని మార్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా యాదవనగర్ కాలనీలోని ఒకేవాడకు చెందిన వారి ఓట్లు మూడు వార్డుల్లో ఉండటంపై అభ్యంతరాలు వచ్చాయి.
ఆందోళనలో సీతారాంపూర్ గ్రామ వాసులు..
గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపూర్‌లో 2,200 మంది ఓటర్లు ఉండగా ఒక్కరిది కూడా అభిప్రాయం తీసుకోకుండా మూడు వార్డులు (6,7,9) విభజించారని..ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సవరణ చేయాలంటూ అధికారులకు అభ్యంతరం తెలిపారు.
ఒకే కాలనీలోని 500 మంది ఓటర్లను మూడు వార్డుల్లో కలిపారు. దీంతో పేరుకు ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నా ప్రయోజనం లేదు. సమస్యను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు చూపించుకుంటూ పట్టించుకోవడం లేదు. ఈసారైనా న్యాయం జరుగుతుందన్న ఆశతో మున్సిపల్ అధికారుకు ఫిర్యాదు చేశాం.
– ఉడుత చిరంజీవి,
సీతారాంపూర్, పరకాల మున్సిపాలిటీ
తప్పులపై అధికారులకు
ఫిర్యాదుల వెల్లువ
జాబితాలో స్థానికేతరులు,
చనిపోయిన వారి పేర్లు
పదో తేదీ నాటికి లిస్ట్ ఫైనల్ అనుమానమే
ముసాయిదాపై గుస్సా!


