ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి: పేదలకు సొంత గృహం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మున్సిపల్, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3,943 ఇళ్లు మంజూరు కాగా, 765 ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిత్తడి నేలలను గుర్తించాలి..
జిల్లాలో చిత్తడి నేలలను (వెట్ ల్యాండ్స్) గుర్తించి, వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర డేటాను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డితో కలిసి జిల్లా చిత్తడి నేలల జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఇరిగేషన్, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
క్రీడాపోటీలకు ఏర్పాట్లు చేయాలి..
సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణపై ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఫిజికల్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయిలో, అనంతరం మండల, జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే
కఠిన చర్యలు..
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.
సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 47 దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆధార్ ఆధారిత హాజరు విధానం పాటించాలని సూచించారు.
చిత్తడి నేలల వివరాలు సమర్పించాలి
సీఎం కప్ క్రీడా పోటీలకు ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్ శర్మ


