ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
భూపాలపల్లి రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని 56మంది నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కారం చూపడం అధికారుల బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డ్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.
సమృద్ధిగా యురియా నిల్వలు
జిల్లాలో సమృద్ధిగా యురియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ రోజు మండల ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్ టీములు, డివిజన్ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతీరోజు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని సూచించారు. ప్రతీ స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభ, ముగింపు నిల్వలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో సహకార శాఖ ద్వారా 10 కేంద్రాలున్నాయని, అదనంగా 22 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా సమస్య ఉంటే 78930 98307 కంట్రోల్ రూం నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి బాబురావు, సహకార అధికారి వాల్యానాయక్ పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లా లక్ష్యం
టీబీ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో అల్‌ట్రా పోర్టబుల్ ఎక్స్‌రే మెషిన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానిత టీబీ కేసులను స్క్రీనింగ్ చేసేందుకు జిల్లాకు అల్‌ట్రా పోర్టబుల్ ఎక్స్‌రే మెషిన్ మంజూరు చేశారని తెలిపారు. ఈ ఎక్స్‌రే మెషిన్ ప్రధాన ఉద్దేశం జిల్లాలో గ్రామస్థాయిలోనే అనుమానిత టీబీ గ్రస్తులకు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, క్షయ వ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ దేవేందర్, డాక్టర్ రాజేష్, డీపీఓ చిరంజీవి, టీబీ సూపర్‌వైజర్ శ్రీకాంత్, రేడియోగ్రాఫర్ సుధాకర్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


