సన్నాలకే సై
సాగు పెరుగుతోంది..
● ఇప్పటికే నార్లు పోసిన అన్నదాతలు
● జిల్లాలో 97,570
ఎకరాల్లో సాగు అంచనా
భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగిలో సన్నరకం ధాన్యం సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. వర్షాలు సంవృద్ధి కురవడంతో చెరువులు, కుంటల్లో నీరు ఉంది. ప్రభుత్వం కూడా సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుంది. దీంతో ఎక్కువ మంది అన్నదాతలు సన్నాల సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకుని ప్రైవేట్ కంపెనీల విత్తనాల కొనుగోలు చేసి నార్లు పోసుకుకున్నారు. అక్కడక్కడ నార్లు ఎదిగిన చోట నాటు కూడా వేస్తున్నారు.
జిల్లాలో 97,570 ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఈ యాసంగిలో 97,570 ఎకరాల వరకు వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 22,000 ఎకరాల్లో దొడ్డు రకం, 18,500 వేల ఎకరాల్లో ఆడ మగ రకం సాగు చేస్తున్నారు. 57,070 వేల ఎకరాలకు పైగా సన్నాలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. సాగు నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో సన్నాల సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పెరుగుతున్న డిమాండ్
దొడ్డురకం ధాన్యం సాగు చేసి మిల్లర్లను బతిమి లాడే బదులు భోజనానికి ఉపయోగించే సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తే కొంతమేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. సన్నరకానికి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉండడంతో ఎగుమతి చేసే అవకాశం ఉంది. మద్ద తు ధర దక్కకపోతే బియ్యంగా మార్చి విక్రయిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతలు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు.
నిండుకుండలా చెరువులు..
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలోని గణపు రం, భీంఘన్‌పూర్ సరస్సులతో పాటు 840కి పైగా చెరువుల్లో నీరు చేరి చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ ఏడాది యాసంగి సాగుకు నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు.
ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో 70 శాతం రైతులు సన్న రకం ధాన్యం సాగుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నార్లు పోసుకున్నారు. వెదజల్లే పద్ధతి ద్వారా పంట నాటు వేసుకుంటే ఖర్చులు ఆదా అవుతాయి.
– బాబురావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
సన్నాలకే సై


