ప్రమాదాల నివారణకు
జనగామ రూరల్: జిల్లాలో రహదారి భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై రహదారి భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణ, అనధికార పార్కింగ్‌లు, రహదారి సూచికలు, లైటింగ్, సర్వీస్ రోడ్లు, వాహనాల వేగ నియంత్రణ, తదితర అంశాలపై సమీక్షించారు. కోమల్ల టోల్ ప్లాజా వద్ద అనధికార పార్కింగ్‌ను తొలగించాలని, కరుణాపురం ప్రాంతంలోని మద్యం దుకాణాల వద్ద పార్కింగ్ సమస్యలను పరిష్కరించి, రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాల బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఉన్న కెమెరాల పనితీరును తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఏసీపీ భీం శర్మ, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, నేషనల్ హైవేస్ హెచ్‌ఎంఆర్‌ఈ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, డీపీఓ వెంకట్‌రెడ్డి, ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరో గ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థ, సమాజ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వాటి నియంత్రణకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు.
కొత్త ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్
జనగామ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు ఫారం 18 దరఖాస్తును ఏఈఆర్‌వోలకు లేదా నియమిత అధికారికి సమర్పించాలన్నారు. నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ, 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరణ, 25లోగా వాటిని పరిష్కరించి, సప్లిమెంట్లను సిద్ధం చేసి, డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


