జనగామ: మరణానంతరం తన భౌతికకాయం వైద్య విద్యకు ఉపయోగపడాలనే సంకల్పంతో పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాలడుగు రత్నాకర్‌రావు (68) ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం జనగామ పట్టణంలోని పద్మాలయ రెసిడెన్సీ, గ్రెయిన్ మార్కెట్ ప్రాంతం లో నివాసముంటున్న ఆయన తన తదనంతరం భౌతికకాయాన్ని జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అందజేసేందుకు బుధవారం బాడీ డొనేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, అనాటమీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ జితేందర్‌కు బాడీ డొనేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో అవసరమైన వివరాలను నమోదు చేసి లిఖితపూర్వకంగా అందజేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో తన మరణానంతరం భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు అందజేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు భార్య అరుణ సంతకంతో కూడిన అంగీకార పత్రాన్ని కూడా సమర్పించారు.
‘అక్షరం’ ఇచ్చిన స్ఫూర్తితో..
ప్రముఖ కవి శ్రీశ్రీ రచించిన ‘అనంతం’లోని అక్షర రూపం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని రత్నాకర్‌రావు తెలిపారు. మనిషి మరణించిన తర్వాత కూడా తన దేహం ద్వారా సమాజానికి, భవిష్యత్ వైద్యులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పట్వారీగా, పంచాయతీ కార్యదర్శిగా ఎంఆర్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన 2016లో పదవీ విరమణ పొందారు. అనంతరం సాహిత్య అభిరుచిని కొనసాగిస్తూ పలు రచనలు చేశారు.
వైద్య విద్యకు విలువైన సేవ:
డాక్టర్ నాగమణి
మరణానంతరం భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు దానం చేయడం గొప్ప సామాజిక సేవ అని, వైద్య విద్యార్థులకు మానవ శరీర నిర్మాణంపై ప్రత్యక్ష అధ్యయనానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి తెలిపారు. అనాటమీ హెచ్‌ఓడీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ బాడీ డొనేషన్ ద్వారా భవిష్యత్ వైద్యులకు మానవ శరీర నిర్మాణంపై శాసీ్త్రయ అవగాహన పెరుగుతుందని, సమాజంలో మరింత మందికి ఈ దానంపై అవగాహన కలగాల్సిన అవసరం ఉందన్నారు.
ముందస్తుగా అనుమతి పత్రం
అందించిన రత్నాకర్‌రావు


