● నెర్రెలు బారిన పొలాలకు జీవం
● వరి, ఆరుతడి పంటలకు మేలు..
● పత్తికి నష్టమంటున్న రైతులు
● చీడపీడలపై ఆందోళన
జనగామ: వానాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత జిల్లాలో తొలిసారిగా భారీ వర్షం కురవడంతో రైతాంగానికి ఊరట లభించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేక వాలిపోతున్న పత్తి మొక్కలు, నెర్రెలు బారిన వరి పొలాలు, ఎండిపోతున్న ఆరుతడి పంటలకు వర్షం ప్రాణం పోసింది. పెట్టుబడులు సైతం దక్కుతాయో లేదోనని ఆందో ళన చెందిన రైతుల్లో భారీ వర్షంతో ఆశలు చిగురించాయి.
3.30లక్షల ఎకరాల్లో సాగు
జిల్లా వ్యాప్తంగా సుమారు 3.30 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర వానాకాలం పంటలు సాగు చేశారు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటగా, సాగునీటి వనరులపై ఆధారపడి పంటలను కాపాడుకునేందు కు రైతులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా కురిసిన వర్షంతో వాగుల్లోకి వరదనీరు చేరడంతోపాటు పలు చెరువులకు జలకళ వచ్చింది. మరికొన్ని మండలాల్లో వాగులు, కల్వర్టులపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహించింది. ప్రస్తుతం కురిసిన వర్షం పంటలకు కొంతమేర ప్రయోజనం చేకూర్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. నర్మెటలో ఊర చెరువు మత్తడి పోస్తుండగా, పాలకుర్తి లక్ష్మినారాయణపురం చెరువులోకి వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. జనగామ మం డలం ఎర్రగుంట తండాలో వరిపంట నేల వాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
52 చోట్ల మత్తళ్లు
జిల్లాలో 771 చెరువులు ఉండగా, 52 మత్తళ్లు పోస్తున్నాయి. ఇందులో 75 నుంచి 100శాతం నిండిన చెరువులు 123, 50 నుంచి 75శాతం 99, 25 నుంచి 50శాతం 273 చెరువులు ఉన్నాయి.
జిల్లాలో 72.8 మిల్లీ మీటర్ల భారీ వర్షం
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని 20 ప్రాంతాల్లో (లొకేషన్లు) కలిపి 72.8 మిల్లీ మీటర్లుగా వర్షం నమోదైంది. చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో అత్యధికంగా 110 మి.మీ. వర్షపాతం నమోదైంది. జఫర్‌గఢ్‌లో 108, దేవరుప్పులలో 103.5, కొడకండ్లలో 97.8, స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండలో 89.3, దేవరుప్పుల కోలుకొండలో 83, తరిగొప్పుల అబ్దుల్ నాగారంలో 82.5, పాలకుర్తిలో 79, జనగామ మండలం వడ్లకొండలో 76.5 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యాయి. జనగామ పట్టణంలో 72.8 మి.మీ. వర్షపాతం నమోదవగా, నర్మెటలో 69.3, పాలకుర్తి గూడూరులో 63, రఘునాథపల్లిలో 62, తరిగొప్పులలో 59.3, బచ్చన్నపేటలో 55, లింగాలఘన్‌ణపురంలో 51, పాలకుర్తి వావిలాలలో 50 మి.మీ. వర్షం కురిసింది. బచ్చన్నపేట మండలం పడమటి కేశ్వాపూర్‌లో 43, జఫర్‌గఢ్ కూనూర్‌లో 20.8 మి.మీ. నమోదైంది.


