సాక్షిప్రతినిధి, వరంగల్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఉమ్మడి వరంగల్‌లో మరోసారి చర్చనీయా ంశంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు వేసిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారంలో కడియం శ్రీహరితోపాటు దానం నాగేందర్‌పై కూడా అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరి విషయంలోనూ విచారణ జరిపి, వారి వాదనలు స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గత మార్చి 11న ఇద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఫిరాయింపునకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో కడియం శ్రీహరి వ్యవహారానికి అప్పట్లో తెరపడినట్లయింది.
‘కడియం’పై ఆ ప్రభావం ఎంత?
మార్చి 11న స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23నుంచి ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దయినట్లుగా కోర్టు పేర్కొంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కూడా ప్రకటించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అదే రోజు స్పీకర్ కొట్టివేసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ విషయంలోనూ తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మొదలైంది.
‘కడియం’పై చేసిన
ఫిర్యాదులేంటి..?
2023, డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌నుంచి కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 2024 మార్చి 31న సీఎం రేవంత్‌రెడ్డి, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు, కుమార్తె తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేయడం, బీఆర్‌ఎస్ కేసీఆర్ తదితరులపై చేసిన విమర్శలు కూడా అప్పట్లో బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో ఉన్నాయి.
దానం తర్వాత.. కడియం సంగతేంటి?
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో
హాట్‌టాపిక్
దానంపై హైకోర్టు వేటును
సమర్థించిన సుప్రీం..
మార్చి 11న ఇద్దరినీ అనర్హత నుంచి
తప్పించిన స్పీకర్
స్పీకర్ తీర్పుతో శ్రీహరికి అప్పట్లో ఊరట.. తాజాగా మళ్లీ చర్చ


