జనగామ: పట్టణంలోని వీవర్స్ కాలనీలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. శ్రీ బాలభక్త ఆంజనేయస్వామి సహిత శ్రీ భక్తమార్కండేశ్వర దేవాలయ ఆవరణలో 1961లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ ఏడాది 65వసారి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పద్మశాలి కులస్తులు అధికంగా నివసించే ఈ కాలనీలో చేనేత వృత్తిపై ఆధారపడే కుటుంబాలు ఏటా ఉత్సవాలను సమష్టి కృషితో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. దేవాలయ కమిటీ, కార్యవర్గాన్ని ఎన్నుకుని వారి ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు జరుపుతున్నారు. ప్రతిరోజు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతున్నారు. కాలానుగుణంగా ఖర్చులు పెరిగినా సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కాలనీ వాసులు ముందుకు వస్తున్నారు.


