జనగామ: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన ముసురు రైతుల్లో ఆశలు నింపింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వానాకాలంలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన చిరు జల్లులు పత్తి, వరి పంటలకు కొంత ఊరటనిచ్చాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌లో అత్యధికంగా 15.3 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. వడ్లకొండలో 9.0, బచ్చన్నపేట, జనగామలో 7.5, లింగాలఘణపురంలో 6.0, దేవరుప్పులలో 5.3, పాలకుర్తి, కొడకండ్లలో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జఫర్‌గఢ్‌లో 1.5, గూడూరు, మల్కాపూర్‌లో 1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముసురు ఇలాగే కొనసాగితే పంటలకు మరింత ప్రయోజనం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


