వనభోజనాలకు వెళ్లి.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

వనభోజనాలకు వెళ్లి.. అనంతలోకాలకు..

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

జనగామ/చిల్పూరు : కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలకు వెళ్లిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి మల్లన్న గండి రిజర్వాయర్‌లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరు బంధువులు సైతం ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జిల్లాలోని చిల్పూరు మండలం గార్లగడ్డ జీపీ శివారు మల్లన్న గండి(రిజర్వాయర్‌) వద్ద శనివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

జిల్లాలోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎండీ ఖలీల్‌, పర్వీన్‌దంపతులకు కుమార్తె, కుమారుడు నజీర్‌ (22) ఉన్నారు. ఖలీల్‌ జనగామలోని సెయింట్‌ పాల్స్‌ ప్రైవేట్‌ పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేస్తున్నారు. కుమారుడు నజీర్‌ హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌లోని సంస్కృతి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నజీర్‌ అక్క కుటుంబం జనగామ మండలం శామీర్‌పేటలో నివసిస్తోంది. అక్క కూతురు పుట్టిన రోజు వేడుక కోసం ఈ నెల 21న నజీర్‌ తన బంధువులతో కలిసి శామీర్‌పేటకు వచ్చాడు. పుట్టిన రోజు వేడుకలు ముగిసిన అనంతరం శనివారం కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి సుమారు 20 మంది వనభోజనాల కోసం చిల్పూరు మండలం గార్లగడ్డ శివారు మల్లన్న గండి రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా సరదాగా గడుపుతున్న సమయంలో సుమారు ఎనిమిది మంది నీటిలో ఈతకు దిగారు. అదే సమయంలో నజీర్‌, అతడి బావ యాకూబ్‌ పాషా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నజీర్‌ను గమనించిన బంధువు, హైదరాబాద్‌ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న సమీర్‌ వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో చేయి పట్టు జారిపోయింది. దీంతో నజీర్‌ నీటిలో కొట్టుకుపోవడంతో సమీర్‌ కూడా అతడిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు. అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సమీర్‌ కూడా అదుపుతప్పి కొట్టుకు పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మధ్యలో ఉన్న ఓ ఇనుప రాడ్డును చాకచక్యంగా పట్టుకుని సమీర్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరోవైపు యాకూబ్‌ పాషా(హైదరాబాద్‌లో చెఫ్‌) కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా సమీపంలో ఉన్న బంధువు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఎండీ అబ్బు అతడిని అతికష్టం మీద కాపాడాడు. దీంతో యాకూబ్‌ పాషా, సమీర్‌ ఇద్దరూ ప్రాణాలతో బయటపడగా నజీర్‌ మాత్రం నీటిలో గల్లంతయ్యాడు. నజీర్‌ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు అరగంట పాటు గాలించారు. చివరకు నీటిలో అతడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. వెంటనే సీపీఆర్‌ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం నజీర్‌ను జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కళ్లముందే బావమరిది మృతి

త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన యాకూబ్‌ పాషా కళ్లముందే బా వమరిది నజీర్‌ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. నజీర్‌ను కాపాడే ప్రయత్నంలో తాను సైతం ప్రమాదంలో చిక్కుకున్న సమీర్‌ ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందాడు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.

మల్లన్నగండిలో మునిగి

ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ఇద్దరికి త్రుటిలో తప్పిన ప్రమాదం

బావమరిది నజీర్‌ను కాపాడేందుకు బావ సాహసం

యాకూబ్‌పాషాను కాపాడిన అబ్బు

అరగంట గాలింపు..

చివరికి మృతదేహం లభ్యం

ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు

కోడలు పుట్టినరోజు వేడుకలకు వచ్చి కుటుంబీకులతో ఆనందంగా గడిపిన నజీర్‌ తిరిగి ఇంటికి చేరకుండానే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు ఖలీల్‌, పర్వీన్‌దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

ప్రమాదకర జలాశయాల్లో అప్రమత్తత అవసరం

మల్లన్న గండి వంటి నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు విహారయాత్రలు, వన భోజనాల కోసం వెళ్లే సమయంలో ఈతకు దిగకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నీటి లోతు, ప్రవాహ తీవ్రత తెలియని ప్రాంతాల్లో సరదా కోసం నీటిలోకి దిగడం ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement