పంటకు పొడి ముప్పు | - | Sakshi
Sakshi News home page

పంటకు పొడి ముప్పు

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

జనగామ: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జనగామ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వి.రమ్య సూచించారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల్లో ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 247.4 మి.మీ. వర్షపాతం నమోదై, సాధారణ వర్షపాతంతో పోలిస్తే 43.2 శాతం లోటు ఉన్నట్లు తెలిపారు. పొడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తేమ సంరక్షణ, సమతుల్య పోషక యాజమాన్యం, కలుపు, చీడపీడల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వరి నార్లు పోయని రైతులు ప్రస్తుతం వెదజల్లే లేదా డ్రమ్‌సీడర్‌ పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చన్నారు. ముదురు నారు నాటాల్సి వస్తే మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గరగా నాట్లు వేయాలని తెలిపారు. వర్షాధారంగా సాగు చేస్తున్న మొక్కజొన్నలో నీటి కొరతతో ఆకులు ముడుచుకోవడం, మొక్క ఎదుగుదల తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే సకాలంలో నీరు అందించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్నప్పుడు యూరియా 2 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకోవచ్చని తెలిపారు. వర్షాభావం తర్వాత వర్షాలు కురిసినప్పుడు ఎకరాకు 25 కిలోల యూరియాను అదనంగా వేయడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చన్నారు. కందిపంట ప్రస్తుతం 20 నుంచి 40 రోజుల దశలో ఉందని, తొలి 60 రోజులు కలుపు లేకుండా చూసుకోవడం కీలకమన్నారు. పెసర, మినుము పంటల్లో చిన్న దశలోనే కలుపు నివారణకు అంతరకృషి చేపట్టాలని, పూత దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పొటాషియం నైట్రేట్‌ లేదా 19:19:19 ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలని తెలిపారు. రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను మార్చుకోవాలని సూచించారు.

జిల్లాలో 43.2 శాతం వర్షపాతం లోటు

పంటల రక్షించుకోవడంలో

రైతుల అప్రమత్తంగా ఉండాలి

రైతు విజ్ఞాన కేంద్రంకోఆర్డినేటర్‌

డాక్టర్‌ వి.రమ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement