రైతు బీమా రెన్యువల్‌పై కొనసాగుతున్న సందిగ్ధత
జిల్లా రైతు బీమా సంవత్సరాల వారీ గణాంకాలు
రాష్ట్రంలో రైతు బీమా పథకానికి 2018 ఆగస్టు 15న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అకాల మరణానికి గురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా తక్షణ సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించే విధంగా పథకాన్ని అమలు చేశారు. బీమా పరిధిలో ఉన్న రైతు సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఏటా రెన్యువల్ చేస్తూ అమలు చేస్తున్నారు. రైతు కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించడంతో రైతు బీమా రాష్ట్రంలోని కీలక సంక్షేమ పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీంకు సంబంధించి రెన్యువల్ విషయంలో తాత్సారం చేస్తుండడంపై సందిగ్ధత నెలకొంది.
జనగామ: రైతు కుటుంబాలకు అండగా నిలిచే రైతు బీమా పథకం రెన్యువల్‌పై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 13తో రైతు బీమా రెన్యువల్ గడువు ముగిసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రెన్యువల్ ప్రక్రియపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. దీంతో పథకం కొనసాగుతుందా.. రెన్యువల్ ఎప్పుడు చేస్తారు.. ప్రస్తుత కాలంలో రైతు అకాల మరణానికి గురైతే బీమా వర్తిస్తుందా? అనే సందేహాలు రైతు కుటుంబాలను వేధిస్తున్నాయి.
వారం దాటుతున్నా..
రైతు బీమా రెన్యువల్ గడువు ముగిసి వారం రోజులు దాటుతున్నా ప్రభుత్వం నుంచి ప్రక్రియపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పథకం అమలుపై స్పష్టత ఉంటుంది. అయితే ఈసారి గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో అయోమయం నెలకొంది.
అకాల మరణం జరిగితే పరిహారం ఎలా?
రెన్యువల్ పూర్తికాకముందే ఏదైనా అనుకోని ఘట నలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రైతు బీమా కొనసాగింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రైతు బీమా రెన్యువల్ చేస్తామని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లేదా ప్రకటన రాకపోవడంతో పథకం భవిష్యత్తుపైనా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే రెన్యువల్ ప్రక్రియపై నిర్ణయం ప్రకటించి రైతులు, వారి కుటుంబాల్లో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని వారు కోరుతున్నారు.
గడువు ముగిసి వారం దాటుతున్నా స్పష్టత కరువు
1.85 లక్షల మంది రైతుల
ఎదురుచూపులు
బీమా రెన్యువల్ కాకుంటే పరిహారం ఎలా? అని ఆందోళన
సంవత్సరం జారీచేసిన మరణాలు చెల్లింపులు
ఎల్‌ఐసీఐడీలు (కోట్లలో)
2018 85,755 378 రూ.18.90
2019 84,777 457 రూ.22.80
2020 89,896 690 రూ.34.50
2021 98,106 554 రూ.27.70
2022 1,03,422 581 రూ.29.05
2023 1,11,815 610 రూ.30.50
2024 1,16,036 641 రూ.32.00
2025 1,16,017 560 రూ.28.00
మొత్తం 8,05,824 4,471 రూ.223


