విద్యార్థుల నిరసన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నిరసన ర్యాలీ

Aug 22 2026 1:23 AM | Updated on Aug 22 2026 1:23 AM

జనగామ: నల్లగొండలో పాఠశాల విద్యార్థుల చేతిలో హత్యకు గురైన ప్రైవేట్‌ పాఠశాల ప్రి న్సిపాల్‌ రూపారెడ్డికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు(ట్రస్మా) ఆద్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పప్పు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూపార్కు నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. ‘సేవ్‌ టీచర్స్‌–సే వ్‌ ఎడ్యుకేషన్‌’ అంటూ నినదించారు. కార్యక్రమంలో ఏకశిల పబ్లిక్‌ స్కూల్‌ సెక్రెటరీ చిర్ర ఉపేందర్‌రెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోస్టల్‌ పెన్షనర్లకు

పెన్షన్‌ అదాలత్‌

జనగామ: పోస్టల్‌ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి 9వ ప్రాంతీయ పోస్టల్‌ పెన్షన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు హనుమకొండ పోస్టల్‌ శాఖ డివిజన్‌ సూపరింటెండెంట్‌ కె.శివాజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్‌, కుటుంబ పెన్షన్‌, పెన్షన్‌ బకాయిలు, ఇతర సంబంధిత సమస్యలపై పెన్షనర్లు తమ ఫిర్యాదులను అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ ప్రాంతానికి సంబంధించిన 9వ ప్రాంతీయ పోస్టల్‌ పెన్షన్‌న్‌ అదాలత్‌ను సెప్టెంబర్‌ 22న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గూగుల్‌ మీట్‌ వేదికగా జరిగే ఈ అదాలత్‌లో పెన్షనర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు సెప్టెంబర్‌ 7వ తేదీ సాయంత్రం 5.45 గంటల వరకు గడువు విధించినట్లు చెప్పారు. పెన్షనర్లు తమ ఫిర్యాదులను హైదరాబాద్‌లోని అబిడ్స్‌ డాక్‌ సదన్‌న్‌ ఐదో అంతస్తులో ఉన్న తెలంగాణ సర్కిల్‌, హైదరాబాద్‌ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ కార్యాలయంలోని సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఐఎఫ్‌ఏ)కు పంపించాలి. కవర్‌పై పోస్టల్‌ పెన్షన్‌ అడల్ట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ రీజి యన్‌ అని పేర్కొనాలని సూచించారు. అలాగే aoifa.hydera bad@indiapost.gov.in ఈమెయిల్‌ అడ్రస్‌కు కూడా సెప్టెంబర్‌ 7లోపు ఫిర్యాదులు పంపవచ్చని తెలిపారు.

జిల్లా స్థాయి

అథ్లెటిక్స్‌ ఎంపికలు

జనగామ రూరల్‌: పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి 14, 16, 18 20 ఏళ్ల బాలబాలికల అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహించారు. దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు, ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీలలో స్థానిక జేఎన్‌ స్టేడియం హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్‌ తెలియజేశారు. 700 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్‌ కుమార్‌, కోశాధికారి ఆవుల అశోక్‌, కార్యదర్శి వంచా చంద్రశేఖర్‌ రెడ్డి, అసోసియేషన్‌ బాధ్యులు రంజిత్‌ రవీంద్ర ప్రసాద్‌ సుధారాణి, దిలీప్‌ కుమార్‌, అశోక్‌ పాల్గొన్నారు.

నీటి సంరక్షణ పనుల

పరిశీలన

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని రాఘవాపూర్‌, నమిలిగొండ, విశ్వనాధఫురం, ఇప్పగూడెం, సముద్రాల గ్రామాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులను సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సర్తాజ్‌బాషా ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన చెక్‌డ్యామ్‌, ఇంకుడుగుంత, తక్కువ ధరతో చేపట్టిన సోప్‌కిట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా సైంటిస్ట్‌ మాట్లాడుతూ.. జల సంచాయ్‌ జల భాగ్యధారి పథకం కోసం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 30వేలకు పైచిలుకు ఫొటోలు అప్‌లోడ్‌ చేయగా అందులో ఒక్క శాతం పనులను రాండమ్‌గా పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డీఆర్‌డీఓ కార్యాలయ నోడల్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ శ్రీనాధ్‌రెడ్డి, ఏపీఎం ప్రేమయ్య, సర్పంచ్‌లు పురమాని కోమల ఐలోని, గుర్రం యాదమ్మఎల్లయ్య, మందపురం రాణిఅనీల్‌గౌడ్‌, బి.యాదగిరి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మందపురం కవితఎల్లగౌడ్‌, పంచాయతీ కార్యదర్శులు పవన్‌, యుగేందర్‌, వేణుమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement