స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి ఫ్రేమ్‌వర్క్ కింద విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓను 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం డివిజన్ కేంద్రంలో ఆందోళన చేపట్టారు. కళాశాల నుంచి శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ మీదుగా శివాజీచౌక్ వరకు ర్యాలీ చేపట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశా రు. విద్యార్థులు రాస్తారోకో చేయగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ యూనస్ మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, జీఓ 97ను రద్దు చేయకుంటే ఆందోళనల్ని మరింత ఉఽధృతం చేస్తామని, అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ నాయకులు పృథ్వీరాజ్, రోహిత్, రియాజ్, అభి, విద్యార్థులు చింత శ్రావణ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
● పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ, రాస్తారోకో
● నాలుగురోజులుగా కొనసాగుతున్న
విద్యార్థుల నిరసనలు


